Operation Sindhoor: నన్ను కంట్రోల్ చేయకండి.. కస్సుమన్న జయాబచ్చన్
ABN , Publish Date - Jul 30 , 2025 | 06:29 PM
ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై పెద్దల సభలో రెండో రోజు జరుగుతున్న చర్చలో జయా బచ్చన్ మాట్లాడారు. పహల్గాంలోని బైసరాన్ వ్యాలీలో ఏప్రిల్ 22న ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation)కు ఆ పేరు పెట్టడాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, వెటరన్ నటి జయా బచ్చన్ (Jaya Bachchan) బుధవారంనాడు రాజ్యసభలో ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడులో పలువురు మహిళలు సిందూరం కోల్పోతే మీరు 'సిందూర్' అని పేరు పెట్టడం ఏమిటని నిలదీశారు. అధికార పక్షం ఎంపీలు వెంటనే జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడంతో 'నన్నవెవరూ అడ్డుకోవద్దు' అంటూ ఆమె కోపడ్డారు.
ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై పెద్దల సభలో రెండో రోజు జరుగుతున్న చర్చలో జయా బచ్చన్ మాట్లాడారు. పహల్గాంలోని బైసరాన్ వ్యాలీలో ఏప్రిల్ 22న ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనలో పలువురు మహిళలు భర్తలను కోల్పోయి, నుదుట సిందూరానికి దూరమయ్యారని, అలాంటప్పుడు 'సిందూర్' అనే పేరు పెట్టడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. దీంతో అధికార పార్టీ ఎంపీలు కొందరు జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడంతో జయాబచ్చన్ సీరియస్ అయ్యారు. 'మీరైనా మాట్లాడాలి, నేనైనా మాట్లాడాలి. మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డుకోలేదు. మహిళలు సభలో మాట్లాడినప్పుడు నేను కూడా ఎప్పుడూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ప్లీజ్ మైండ్ యువర్ టంగ్' అని అన్నారు.
జయాబచ్చన్ పక్కనే కూర్చొన్న శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఒక దశలో జయాబచ్చన్‌ను శాంతపరిచే ప్రయత్నం చేశారు. దీంతో జయా బచ్చన్ ఆమెవైపు చూస్తూ 'ప్రియాంకా... నన్ను కంట్రోల్ చేయెద్దు' అని అన్నారు. జయాబచ్చన్ తిరిగి మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి జరగడానికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణని తప్పుపట్టారు. 'మీరు ప్రజల విశ్వాసాన్ని నాశనం చేశారు. బాధిత (పహల్గాం) కుటుంబాల వారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు' అని ఆక్షేపించారు.
జయాబచ్చన్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
కాగా, జయాబచ్చన్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. జయాబచ్చన్ మెండ్‌సైట్‌ను ప్రశ్నించారు. 'సిందూర్ అనేది కేవల అలంకారం కాదు. అది బలం, సామర్ధ్యానికి ప్రతీక. ఒక స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు ఆపరేషన్ సిందూర్ అనే పేరును ఎంచుకున్నాం. మీరు సిందూరం తుడిచివేస్తే..మిమ్మల్ని మట్టుపెడతాం అనేదే ఆ సందేశం. ఇచ్చిన మెసేజ్‌ను ఆపరేషన్ సిందూర్‌తో సాధించాం' అని పూనావాలా తెలిపారు. సాయుధ బలగాల నైతిక స్థైర్యం దెబ్బతీసేందుకే కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు తరచు ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నాయని ఆక్షేపణ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్
22 నిమిషాల్లో ప్రతికారం తీర్చుకున్నాం.. జేపీ నడ్డా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి