Share News

Japan: ఒక్క సెకనులో నెట్‌ఫ్లిక్స్‌ వీడియోలన్నీ డౌన్‌లోడ్‌!

ABN , Publish Date - Jul 12 , 2025 | 05:44 AM

నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న మొత్తం వీడియోలన్నింటినీ ఒక్కటంటే ఒక్క సెకనులో డౌన్‌లోడ్‌ చేసుకునే ఇంటర్నెట్‌ వేగాన్ని జపాన్‌ సాధించింది.

Japan: ఒక్క సెకనులో నెట్‌ఫ్లిక్స్‌ వీడియోలన్నీ డౌన్‌లోడ్‌!

  • 10 వేల సార్లు ఇంగ్లిష్‌ వికీపీడియా కూడా..

  • ఇంటర్నెట్‌ వేగంలో సరికొత్త రికార్డు

  • సెకనుకు 1.02 పెటాబిట్స్‌

  • జపాన్‌ శాస్త్రవేత్తల ఆవిష్కరణ

న్యూఢిల్లీ, జూలై 11: నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న మొత్తం వీడియోలన్నింటినీ ఒక్కటంటే ఒక్క సెకనులో డౌన్‌లోడ్‌ చేసుకునే ఇంటర్నెట్‌ వేగాన్ని జపాన్‌ సాధించింది. సెకనుకు 1.02 పెటాబిట్లతో (10,20,000 గిగాబైట్లు) నడిచే ఈ ఇంటర్నెట్‌.. ప్రపంచంలోనే అత్యంత వేగంతమైన నెట్‌గా రికార్డు నెలకొల్పింది. మన దేశంలో ఉన్న సగటు ఇంటర్నెట్‌ స్పీడ్‌ 63.55 ఎంబీపీఎ్‌సతో పోల్చితే ఇది 1.6 కోట్ల రెట్లు వేగవంతమైనది. అమెరికాలోని సగటు నెట్‌తో పోల్చినా.. 35 లక్షల రెట్లు వేగవంతమైనది. జపాన్‌లోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ’ (ఎన్‌ఐసీటీ) ఈ వివరాలను వెల్లడించింది. ఎన్‌ఐసీటీలోని ఫొటానిక్‌ నెట్‌వర్క్‌ ల్యాబొరేటరీ, సుమితొమో అనే మరో సంస్థతో కలిసి.. కనీవినీ ఎరుగని ఈ ఇంటర్నెట్‌ వేగాన్ని సాధించింది. టెక్నాలజీ రంగంలో దీనిని గొప్ప ముందంజగా భావిస్తున్నారు.


దూరం పెరుగుతున్నకొద్దీ సిగ్నల్స్‌ బలహీనం

ఆప్టికల్‌ ఫైబర్ల గుండా వెళ్లే డేటా స్పీడ్‌ను పెంచటంపై నిరంతరం పరిశోధనలు నడుస్తూనే ఉన్నాయి. ఒక సెకనుకు పెటాబిట్ల వేగంతో డేటాను ఇంతకుముందు కూడా పంపించగలిగారు గానీ.. అది వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని ఎన్నడూ మించలేదు. దీనివల్ల అవి నిత్యజీవనంలో ఉపయోగానికి రాకుండా పోయే పరిశోధనలుగానే మిగిలిపోయాయి. సిగ్నల్స్‌ ప్రయాణిస్తున్న దూరం పెరుగుతున్నకొద్దీ అవి బలహీనపడుతుంటాయి. ఫైబర్‌ కోర్ల వద్ద వాటి వేగాన్ని తిరిగి పెంచటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అయితే, ఇది సాంకేతికంగా ఒక పెద్ద సవాల్‌. దీనిని జపాన్‌ శాస్త్రవేత్తలు అధిగమించగలిగారు. వారు 19 కోర్లతో కూడిన ప్రత్యేకమైన ఆప్టికల్‌ ఫైబర్‌ను రూపొందించి ఈ ప్రయోగం జరిపారు. ఈ ఫైబర్‌ మందం 0.125 మిల్లీమీటర్లు. ప్రస్తుతం ప్రపంచమంతటా వినియోగిస్తున్న ఆప్టికల్‌ ఫైబర్‌ కూడా 0.125 మిల్లీమీటర్ల మందంతోనే ఉంటోంది.


ఇక ఈ 19 కోర్లూ వేటికవే డేటాను తీసుకెళ్లేలా డిజైన్‌ చేశారు. తద్వారా ఒకే ఆప్టికల్‌ ఫైబర్‌లో 19 మార్గాల్లో డేటా వెళ్తుంది. ఈ విధంగా ఏకంగా 1808 కి.మీ.ల దూరానికి సెకనుకు 1.02 పెటాబిట్ల వేగంతో డేటాను పంపగలిగారు. ఈ వేగంతో ఇంగ్లిష్‌ వికీపీడియాలో ఉన్న యావత్‌ సమాచారాన్ని ఒక సెకనులో పది వేల సార్లు డౌన్‌లోడ్‌ చేయవచ్చు. పది వేల 4కే సినిమాలను, 1,27,500 సంవత్సరాలపాటు నడిచే సంగీతాన్ని ఒక సెకనులో డౌన్‌లోడ్‌ చేయవచ్చు. ఇంటర్నెట్‌ వేగంలో ఈ సరికొత్త రికార్డు.. భవిష్యత్తు సాంకేతికతను గణనీయంగా మార్చనుంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఏఐ, డ్రైవర్‌ రహిత వాహనాలు, రియల్‌టైమ్‌ ట్రాన్స్‌లేషన్‌ టూల్స్‌ వంటి రంగాల్లో భారీ ఎత్తున డేటా ట్రాన్స్‌ఫర్‌ అవసరమవుతోంది. ఆయా రంగాలు అభివృద్ధి చెందినాకొద్దీ ఈ డిమాండ్‌ మరింత పెరుగుతుంది. అయితే.. ఈ ఆవిష్కరణ ఇప్పటికిప్పుడు సాధారణ ప్రజల వినియోగంలోకి వచ్చే అవకాశాలు తక్కువే. కానీ ప్రభుత్వాలు, డేటాసెంటర్‌ ఆపరేటర్లు, టెలికాం కంపెనీలకు ఇది పనికొచ్చే చాన్స్‌ ఉంది. 6జీ నెట్‌వర్క్‌లకు, నేషనల్‌ బ్రాడ్‌బ్యాండ్‌లకు, కొత్తతరం అండర్‌వాటర్‌ కేబుల్స్‌కు ఇది మార్గం వేయవచ్చు.

Updated Date - Jul 12 , 2025 | 05:44 AM