Italian Scientists: కాంతిని గడ్డ కట్టించారు
ABN , Publish Date - Jun 30 , 2025 | 02:40 AM
సెకనుకు దాదాపుగా 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫోటాన్ల సమూహమైన కాంతిని ఇటలీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ పవియా, సీఎన్‌ఆర్ నానోటెక్ పరిశోధకులు...

ఘనపదార్థంలా కనపడుతూనే
ద్రవలక్షణాలుండే సూపర్‌సాలిడ్‌లా
మార్చిన ఇటలీ శాస్త్రజ్ఞులు
క్వాంటం కంప్యూటర్లు, ఆప్టికల్
ప్రాసెసర్ల అభివృద్ధికి, వేగవంతమైన
సమాచార వ్యవస్థల్లో కీలకం
న్యూఢిల్లీ, జూన్ 29: సెకనుకు దాదాపుగా 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫోటాన్ల సమూహమైన కాంతిని ఇటలీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ పవియా, సీఎన్‌ఆర్ నానోటెక్ పరిశోధకులు గడ్డకట్టించారు. ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఏర్పాటు చేసిన అత్యంత శీతలమైన వాతావరణంలోకి (అణువాయువులోకి) పంపడం ద్వారా దాన్ని ఒక ‘సూపర్ సాలిడ్’లా మార్చగలిగారు (పైకి గడ్డకట్టినట్టుగా కనిపిస్తూనే అంతర్గతంగా ద్రవలక్షణాలను కలిగి ఉండే పదార్థాలను క్వాంటం సిద్ధాంతంలో సూపర్ సాలిడ్స్ అంటారు). మామూలు సాలిడ్స్ (ఘనపదార్థాలు) వాటంతట అవి కదలవు. కానీ, సూపర్ సాలిడ్స్ అలా కాదు. వాటిలోని కణాల ఆధారంగా.. తమ నిర్మాణంలో ఏ మార్పూ లేకుండా అవి అవి తమ దిశను, సాంద్రతను మార్చుకోగలవు. ఇలా కాంతిని నియంత్రించగలిగే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. కాంతితో, అతి తక్కువ విద్యుత్తుతో పనిచేసే కంప్యూటర్లను అభివృద్ధి చేయవచ్చు. భవిష్యత్తులో మనం వాడే క్వాంటం కంప్యూటర్లు, ఆప్టికల్ ప్రాసెసర్లను ఈ టెక్నాలజీ ద్వారా తయారుచేయవచ్చు.
ఫోటాన్లను నియంత్రించగలిగే శక్తి సంపూర్ణంగా అందుబాటులోకి వస్తే మనం ఊహించలేనంత వేగంతో డేటాను, అత్యంత సురక్షితంగా ప్రసారం చేయొచ్చు. కాంతి ఆధారిత సమాచార ప్రసార ఉపగ్రహ వ్యవస్థలను అభివృద్ధి చేయొచ్చు. కాంతిలో డేటానూ భద్రపరచవచ్చు. ‘ఆప్టికల్ మెమొరీ చిప్స్’ వంటి అద్భుతమైన పరిజ్ఞానాలను భవిష్యత్తులో రూపొందించడానికి ఇదొక కీలకమైన ముందడుగు. అవి ప్రస్తుతం మనం వాడే హార్డ్ డిస్క్ డ్రైవ్‌ల కన్నా కొన్ని వేల రెట్లు వేగంతో పనిచేస్తాయి. మెడికల్ ఇమేజింగ్ (అంటే ఎక్స్‌రేల వంటివి), అంతరిక్ష రహస్యాల అన్వేషణలో ఈ పరిజ్ఞానం కీలకంగా ఉపయోగపడుతుంది.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News