Share News

ISRO To Launch NISAR: నేడే నింగిలోకి నిసార్‌ నిఘా నేత్రం

ABN , Publish Date - Jul 30 , 2025 | 06:09 AM

ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. భూమి అణువణువునూ స్కాన్‌ చేసి..

ISRO To Launch NISAR: నేడే నింగిలోకి నిసార్‌ నిఘా నేత్రం

  • ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధం

  • జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి

  • ప్రారంభమైన 27:30 గంటల కౌంట్‌డౌన్‌

  • నేటి సాయంత్రం 5:40గంటలకు నింగిలోకి

సూళ్లూరుపేట, తిరుమల, జూలై 29 (ఆంధ్రజ్యోతి):ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. భూమి అణువణువునూ స్కాన్‌ చేసి.. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలవనరులు.. ఇలా అన్నింటినీ జల్లెడ పట్టే భూపరిశీలన ఉపగ్రహం నిసార్‌ (నాసా-ఇస్రో సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌) ప్రయోగానికి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి బుధవారం సాయంత్రం 5:40 గంటలకు జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ ద్వారా 2,392 కిలోల బరువున్న నిసార్‌ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను మంగళవారం మధ్యాహ్నం 2:10 గంటలకు ప్రారంభించారు. కౌంట్‌డౌన్‌ 27:30 గంటలు కొనసాగిన తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఇస్రో-నాసా సంయుక్తంగా తొలిసారిగా రూపొందించి ప్రయోగిస్తున్న ఉపగ్రహం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు అమెరికా నుంచి నాసా శాస్త్రవేత్తలు కూడా షార్‌కు చేరుకున్నారు. గతంలో చేపట్టిన రెండు ప్రయోగాలూ విఫలం కావడంతో శాస్త్రవేత్తలు జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ ప్రయోగ విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

Updated Date - Jul 30 , 2025 | 06:09 AM