Share News

ISRO: జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌16 రిహార్సల్‌ విజయవంతం

ABN , Publish Date - Jul 28 , 2025 | 05:08 AM

ఇస్రో-నాసా సంయుక్తంగా చేపడుతున్న నిసార్‌ ఉపగ్రహ ప్రయోగానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ISRO: జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌16 రిహార్సల్‌ విజయవంతం

  • 30న నిసార్‌ ఉపగ్రహంతో రోదసీలోకి

  • నేడు ఎంఆర్‌ఆర్‌ భేటీ.. రేపు కౌంట్‌డౌన్‌

సూళ్లూరుపేట, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఇస్రో-నాసా సంయుక్తంగా చేపడుతున్న నిసార్‌ ఉపగ్రహ ప్రయోగానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5:40 గంటలకు జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ ద్వారా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ సన్నాహకాల్లో భాగంగా ఆదివారం రాకెట్‌ రిహార్సల్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. రాకెట్‌ను మొబైల్‌ సర్వీస్‌ టవర్‌ నుంచి ముందుకు తీసుకొచ్చి మళ్లీ వెన క్కి తీసుకెళ్లే ప్రయోగ ప్రక్రియను శాస్త్రవేత్తలు నిర్వహించారు.


రాకెట్‌లోని అన్ని దశల పనితీరును పరిశీలించి తుది దశ తనిఖీలు చేశారు. ప్రయోగానికి సంబంధించి రాకెట్‌ సంసిద్ధత (ఎంఆర్‌ఆర్‌) సమావేశం సోమవారం షార్‌లో జరగనుంది. ఎంఆర్‌ఆర్‌ అనంతరం షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ అధ్యక్షతన లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (లాబ్‌) సమావేశమవుతుంది. ఆ తర్వాత కౌంట్‌డౌన్‌ సమయాన్ని శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటిస్తారు. కౌంట్‌డౌన్‌ 24 గంటలు లేదా 25:30 గంటలకు ముందు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది నాసా-ఇస్రో ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో అమెరికా శాస్త్రవేత్తలు కూడా షార్‌కు రానున్నారు.

Updated Date - Jul 28 , 2025 | 05:08 AM