Share News

Pak ISI S1 Unit: పాక్ ఐఎస్ఐ సీక్రెట్ యూనిట్.. భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న భూతం ఇదే

ABN , Publish Date - Nov 09 , 2025 | 08:31 PM

పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి చెందిన ఎస్1 అనే సీక్రెట్ యూనిట్ రెండు దశాబ్దాలుగా భారత్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్‌లో అధికశాతం ఉగ్రదాడుల వెనుక ఈ యూనిట్ హస్తం ఉన్నట్టు తెలిపాయి.

Pak ISI S1 Unit: పాక్ ఐఎస్ఐ సీక్రెట్ యూనిట్.. భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న భూతం ఇదే
ISI S1 unit cross border Terrorism

ఇంటర్నెట్ డెస్క్: రెండు దశాబ్దాల నాటి ముంబై పేలుళ్లు మొదలు ఇటీవలి పహల్గాం దాడి వరకూ.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఎందరో అమాయకులు బలయ్యారు. ఈ కుట్రల వెనుక పాక్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ సీక్రెట్ విభాగం ఈ దారుణాలకు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 25 ఏళ్లుగా ఈ యూనిట్ భారత్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందన్న విషయాన్ని గుర్తించాయి (Pakistan ISI secret wing S1).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ సీక్రెట్ విభాగం పేరు ఎస్1. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి ఈ బృందమే ప్రధాన కారణం. ఈ విభాగం పూర్తిస్థాయి కార్యకలాపాలను భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవల గుర్తించాయి. పాక్ ఆర్మీకి చెందిన కల్నల్ స్థాయి అధికారి ఒకరు ఈ టీమ్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. ఇతడిని కూడా ఎస్1 అన్న పేరుతో పిలుస్తారట. మరో ఇద్దరు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. వీరిని గాజీ1, గాజీ2 అనే సీక్రెట్ పేర్లతో పిలుస్తారు.


ఇస్లామాబాద్‌లో ఈ యూనిట్ ప్రధాన కార్యాలయం ఉంది. మాదకద్రవ్యాల కార్యకలాపాల డబ్బు ఈ యూనిట్‌కు ప్రధాన ఆదాయ వనరు అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎస్1 యూనిట్‌లోని సభ్యులు వివిధ రకాల బాంబులు, ఐఈడీలు చేయడంలో నిష్ణాతులు. రకరకాల ఆయుధాలను వినియోగించడంలో కూడా వీరికి నైపుణ్యం ఉంది. భారత్‌లో అనేక ప్రాంతాలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన మ్యాప్‌లు వీరి వద్ద రెడీగా ఉంటాయట.

ఎస్1 ఉనికి గురించి ఎప్పటినుంచో తెలిసినప్పటికీ ఈ యూనిట్ కార్యకలాపాలను ఇటీవలే భారత వర్గాలు పూర్తిస్థాయిలో గుర్తించాయి. ఎస్1 బృందం సభ్యులు జైష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తయ్యబా ఉగ్ర సంస్థల శక్షిణ శిబిరాల్లో కూడా తరచూ పాల్గొంటారు. పెద్దగా గడ్డాలు పెంచుకుని, స్థానిక సంప్రదాయిక దుస్తులు ధరించి ఎవరికీ అనుమానం రాకుండా స్థానికుల్లో ఒకరిగా కలిసి తిరుగుతుంటారట. గత రెండు దశాబ్దాల్లో ఎస్1 యూనిట్ వేల కొద్దీ టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


ఇవి కూడా చదవండి:

అమెరికాలో ఇద్దరు భారతీయ గ్యాంగ్‌స్టర్స్ అరెస్టు

పాక్ ఆర్మీ చీఫ్‌‌‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 09 , 2025 | 08:39 PM