Share News

Kargil Vijay Diwas: ఆర్మీలో సరికొత్త దళం.. రుద్ర

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:26 AM

కాలానుగుణంగా మారుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో సరిహద్దుల వద్ద శత్రుమూకల ఆటకట్టించేలా భారత ఆర్మీలో ఓ శక్తిమంతమైన దళం ఏర్పాటైంది.

Kargil Vijay Diwas: ఆర్మీలో సరికొత్త దళం.. రుద్ర

  • భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ‘ఆల్‌ ఆర్మ్‌ బ్రిగేడ్‌’ ఏర్పాటు

  • సరిహద్దుల్లో ‘భైరవ్‌’ పేరుతో లైట్‌ కమాండో బెటాలియన్‌

  • ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది వెల్లడి.. కార్గిల్‌ అమరులకు నివాళి

న్యూఢిల్లీ, జూలై 26: కాలానుగుణంగా మారుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో సరిహద్దుల వద్ద శత్రుమూకల ఆటకట్టించేలా భారత ఆర్మీలో ఓ శక్తిమంతమైన దళం ఏర్పాటైంది. ఈ దళం పేరు ‘రుద్ర’. ఇందులో పదాతి దళం, యుద్ధ వాహనాలు, సాయుధ యూనిట్లు, డ్రోన్లు, ఫిరంగి దళం, ప్రత్యేక శిక్షణ పొందిన సైనికులు... ఇలా విభిన్న రకమైన దళాలు ఒక గ్రూప్‌గా ఉంటాయని ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది శనివారం వెల్లడించారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌(జూలై 26)ను పురస్కరించుకొని ఆయన ఈ ప్రకటన చేశారు. భారత సైన్యం ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ ‘ఆల్‌ ఆర్మ్‌ బ్రిగేడ్‌’ను రూపొందించినట్లు ఆయన వివరించారు. దీంతో పాటు, సరిహద్దుల్లో మెరుపు ఆపరేషన్ల కోసం ‘భైరవ్‌’ పేరుతో లైట్‌ కమాండో బెటాలియన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ద్వివేది తెలిపారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. కార్గిల్‌ అమర వీరులకు నివాళి అర్పించేందుకు ‘ఈ-శ్రద్ధాంజలి’ పేరుతో కొత్తగా యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్‌లో కార్గిల్‌ యుద్ధం, సైనికుల వీర గాథలు ఉంటాయన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివ్‌సను పురస్కరించుకొని శనివారం రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌.. కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించారు. సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భారత సైనికుల అసాధారణమైన శౌర్యానికి కార్గిల్‌ విజయం ప్రతీక’’ అని ముర్ము అన్నారు. సైనికుల త్యాగాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మోదీ కొనియాడారు.


సిందూర్‌ తర్వాతనే రూపకల్పన

భారతీయ సైనికుల కుటుంబాలకు చెందిన న్యాయ వివాదాల్లో సాయం కోసం కేంద్రం కొత్తగా ‘నల్సా వీర్‌ పరివార్‌ సహాయతా యోజన’ను తీసుకువచ్చింది. ఈ పథకం కింద కేంద్రప్రభుత్వం సైనికుల కుటుంబాలకు న్యాయ సాయం అందించనుంది. సైనికులు సరిహద్దులో విధులు నిర్వహించడం, తరచూ ఇళ్లకు వెళ్లడానికి వీలు కాని నేపథ్యంలో కేంద్రం ఈ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా దీన్ని ప్రకటించారు. శనివారం శ్రీనగర్‌లో జరిగిన ఓ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ(నల్సా) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు.


ప్రత్యేక పాఠ్యాంశంగా ఆపరేషన్‌ సిందూర్‌

ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రత్యేక పాఠ్యాంశంగా పెట్టాలని ఎన్‌సీఈఆర్‌టీ యోచిస్తోంది. పాఠ్య పుస్తకాల్లో భాగంగా కాకుండా విడిగా 8 నుంచి 10 పేజీలతో రెండు మాడ్యూల్స్‌లో విద్యార్థులకు అందించనుంది. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒకటి, 9 నుంచి 12వ తరగతి వరకు మరొక మాడ్యూల్‌ను అందిస్తారు. అత్యంత విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రత్యేక పాఠ్యాంశంగా పెట్టడం ద్వారా విద్యార్థులకు భారత సైనిక శక్తి గురించి పూర్తి స్థాయిలో తెలిసి వస్తుందని ఎన్‌సీఈఆర్‌టీ భావిస్తోంది. దీంతో పాటు శుభాంశు శుక్లా రోదసి యాత్ర, చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-వన్‌, కోవిడ్‌-19, జీ-20 సదస్సు, డిజిటల్‌ ఇండియా తదితర అంశాలను కూడా ప్రత్యేక పాఠ్యాంశాలుగా పెట్టాలని యోచిస్తోంది.

Updated Date - Jul 27 , 2025 | 05:26 AM