Demolition Rules: ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిర్మాణాలపై కేంద్రం నజర్.. నిబంధనలు కఠినతరం
ABN , Publish Date - Jun 19 , 2025 | 09:11 AM
ఎయిర్ పోర్టు పరిసరాల్లోని నిర్మాణాలపై కేంద్రం దృష్టి సారించింది. నిబంధనలను అతిక్రమించిన భవనాల ఎత్తు తగ్గించడం లేదా కూల్చి వేసేందుకు వీలుగా ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. వీటిపై ప్రజల సూచనలు, సలహాలను కోరింది.

ఇంటర్నెట్ డెస్క్:ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలపై దృష్టి సారించింది. ఎయిరోడ్రోమ్ జోన్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల ఎత్తు తగ్గించేందుకు లేదా కూల్చి వేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ క్రాఫ్ట్ (డిమోలిషన్ ఆఫ్ ఆబ్‌స్ట్రక్షన్) రూల్స్ 2025 పేరిట ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. వీటిపై సూచనలు, అభ్యంతరాలను సమర్పించాలని కోరింది. విమానాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.
తాజా రూల్స్ ప్రకారం, ఎయిరోడ్రోమ్ జోన్ పరిధిలో అడ్డంకిగా మారిన నిర్మాణాలు చెట్లను తొలగించేందుకు అధికారాలు లభిస్తాయి. పరిమితికి మించి ఎత్తు ఉన్న నిర్మాణాల యజమానులకు తొలుత ఎయిరోడ్రోమ్ ఇంచార్జ్ ఆఫీసర్ నోటీసులు పంపిస్తారు. ఈ మేరకు భవన యజమానులు భవనం సైజు, నిర్మాణ ప్లాన్, సైట్ ప్లాన్ తదితర వివరాలను 60 రోజుల్లోపు సమర్పించాల్సి ఉంటుంది. నోటీసులకు స్పందించని పక్షంలో సదరు భవనం ఎత్తును తగ్గించడం లేదా మొత్తం కూల్చి వేసే అవకాశం ఉంది. నిబంధనలు అతిక్రమించినట్టు నిర్ధారణ అయిన పక్షంలో డీజీసీఏ లేదా మరో అధికారి.. యజమానులకు భవనం కూల్చి వేయడం లేదా ఎత్తు తగ్గించడం చేయాలని ఆదేశాలు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వులను 60 రోజుల్లోపు అమలు చేయాల్సి ఉంటుంది. కొన్ని పరిమితులకు లోబడి ఈ గడువు పొడిగించే అవకాశం ఉంది.
తాజా ముసాయిదా నిబంధనల ప్రకారం, అధికారులకు ఎయిరోడ్రోమ్ పరిధిలోని భవనాలను తనిఖీ చేసే అధికారం ఉంది. తినిఖీలకు యజమానులు సహకరించకపోతే అందుబాటులో ఉన్న రికార్డుల మేరకు చర్యలు తీసుకుంటారు. అధికారిక ఉత్తర్వులను భవన యజమానులు పాటించని పక్షంలో సంబంధిత అధికారి జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందిస్తారు. కలెక్టర్ సారథ్యంలో చెట్లు కొట్టేయడం లేదా భవనాల ఎత్తు కుదించడం, లేదా కూల్చి వేయడం జరుగుతాయి. కూల్చివేతల ఆదేశాలపై పౌరులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రూల్స్ నోటిఫై చేయక ముందు చేపట్టిన నిర్మాణాలకే పరిహారం అందుబాటులో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
రంగంలోకి కేంద్రం.. ఇరాన్ నుంచి భారత్‌కు 110 మంది విద్యార్థుల తరలింపు
27 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా తరహా ప్రమాదం.. ప్రాణాలు దక్కించుకున్న 11ఏ సీటు ప్యాసెంజర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి