Hashim Musa Ex Pakistan Army Commando: పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:36 PM
పహల్గాం దాడిలో ప్రధాన నిందితుడు హషీమ్ మూసా..పాక్ మాజీ పారా మిలిటరీ కమాండో అని నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. గతేడాది జరిగిన ఉగ్రఘటనల్లోనూ అతడు పాలుపంచుకున్నట్టు వెల్లడించాయి.

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడిని తమకు అంటగడుతున్నారని పాక్ చెప్పుకుంటోంది. సుద్దపూస మాటలు వల్లిస్తూ నిష్పాక్షిక దర్యాప్తు కోసం డిమాండ్ కూడా చేస్తోంది. అయితే, పాక్ నయవంచన, ఉగ్రమూకలకు చేయుతనిస్తున్న వైనం మరోసారి పక్కా ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. పహల్గాం దాడిలో ప్రధాన నిందితుడు, అమాయక టూరిస్టులను బలితీసుకున్న నరరూప రాక్షసుడు హషీమ్ మూసా ఓ మాజీ పాక్ పారా కమాండో అని తాజాగా బయటపడింది.
పాక్ పారా మిలిటరీ కమాండో అయిన మూసా ఆ తరువాత లష్కరే తయ్యబా (ఎల్ఈటీ) ఉగ్ర సంస్థలో చేరాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్‌ఈటీని బలోపేతం చేసేందుకు, కశ్మీర్‌లో అరాచకం సృష్టించేందుకు పాక్ ఆర్మీ స్వయంగా మూసాను ఎల్‌ఈటీకి పంపి ఉంటుందని చెబుతున్నారు.
పారా మిలిటరీ దళాల్లో పనిచేసిన మూసా అత్యాధునిక సంప్రదాయేతర యుద్ధ తంత్రంలో సుశిక్షితుడు. కోవర్ట్ ఆపరేషన్లలో దిట్ట. ఆధునిక ఆయుధాల వినియోగంలో మంచి పట్టు ఉండటంతో పాటు హ్యాండ్ టూ హ్యాండ్ కాంబాట్ (ఆయుధాలు లేకుండా నేరుగా తలపడటం)లో కూడా శిక్షణ పొందాడు. నావిగేషన్ నైపుణ్యంతో పాటు ప్రత్యర్థి భూభాగాల్లో భద్రతాదళాలకు చిక్కకుండా సంచరించడంలో కూడా అతడికి తర్ఫీదు ఉంది. 2023 సెప్టెంబర్‌లో అతడు భారత భూభాగంలోకి ప్రవేశించి ఉంటాడని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. తన ఉగ్రకార్యకలాపాల కోసం కశ్మీర్‌లోని బుడ్గామ్ జిల్లాను ఎంచుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నాయి.
పహల్గాం దాడి మూలాలు కనుక్కునేందుకు ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులకులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో 14 మంది స్థానిక ఓవర్ గ్రౌండ్ వర్కర్లు కూడా ఉన్నారు. వీరిని విచారించగా మూసా నేపథ్యం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పాక్ టెర్రరిస్టులకు కావాల్సిన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు, ఘటనా స్థలంలో రెక్కి నిర్వహించేందుకు ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్లు సహకరించి ఉండొచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.
పహల్గాం దాడిలో పాక్, ఐఎస్ఐల పాత్ర ఏంటో మూసా ఉదంతంతో స్పష్టంగా తెలిసిపోయిందని నిఘా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతేడాది కశ్మీర్‌లో ఉగ్రవాద మూకలు ఇదే రీతిలో ఒక డాక్టర్‌తో పాటు మరో ఇద్దరు ఆర్మీ సిబ్బంది, ఆర్మీ పోర్టర్లను పొట్టనపెట్టుకున్నాయి. ఈ దాడుల్లో కూడా మూసా పాల్గొన్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
పహల్గాం దాడిలో స్థానిక ఓవర్ గ్రౌండ్ వర్కర్ల (ఓడబ్ల్యూజీ) నెట్‌వర్క్‌తో పాటు ఓ ఊగ్రమూక బృందం పాత్ర ఉందని ఎన్‌ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదులకు స్థానిక ఓడబ్ల్యూజీలు మార్గ నిర్దేశకత్వంతో పాటు ఆశ్రయం, ఆయుధాల రవాణాలో కూడా సాయపడి ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. ఈ దాడిలో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు మూసా, అలీ భాయ్‌తో పాటు మరో ఇద్దరు స్థానికులు అదిల్ థోకర్, ఆసిఫ్ షేక్ పాల్గొన్నారని ఇప్పటికే అధికారులు ధ్రువీకరించారు. కానీ ఈ దాడిలో మరింత మంది పాక్ ఉగ్రవాదులు పాలుపంచుకుని ఉండొచ్చని ఓజీడబ్ల్యూల విచారణలో తేలినట్టు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్.. కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత
కశ్మీర్‌లో ఐదో రోజూ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్తాన్
మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Read More Latest Telugu News and National News