Central Govt: టూవీలర్లకు రెండు హెల్మెట్లు తప్పనిసరి
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:30 AM
ద్విచక్రవాహన తయారీదారులు వాహనం కొనుగోలు సమయంలోనే వినియోగదారులకు రెండు హెల్మెట్లు అందించడం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

కొనుగోలు సమయంలోనే వాటిని వాహన తయారీదారులు అందించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన
న్యూఢిల్లీ, జూన్ 28: ద్విచక్రవాహన తయారీదారులు వాహనం కొనుగోలు సమయంలోనే వినియోగదారులకు రెండు హెల్మెట్లు అందించడం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కొత్త నియమాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటార్ వాహనాల రూల్స్-1989కు పలు ముఖ్యమైన మార్పులను ప్రతిపాదించింది. కొత్త సవరణ నియమాల తుది నోటిఫికేషన్ అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ రూల్ తప్పనిసరి అవుతుందని ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది. వాహనం నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వారి భద్రత కోసం కొత్త నిబంధనను తీసుకురానున్నట్లు తెలిపింది. హెల్మెట్ నిబంధనతో పాటు ప్రభుత్వం మరో భద్రతా చర్యను కూడా ప్రతిపాదించింది. 2026, జనవరి 1 నుంచి 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం లేదా గంటకు 50 కిలోమీటర్ల వేగం దాటే మోటార్ సైకిళ్లు, స్కూటర్లు సహా అన్ని కొత్త ఎల్2 క్యాటగిరీ ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థ(ఏబీఎ్‌స)లను అమర్చాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా వాహనానికి ఆకస్మికంగా బ్రేక్ వేసిన సమయంలో మెరుగైన నియంత్రణ కల్పించడంతో పాటు జారిపోయే అవకాశాలను తగ్గిస్తుంది.