Share News

Maharashtra: మహిళా స్కీమ్‌ సొమ్ము తినేస్తున్న మగాళ్లు!

ABN , Publish Date - Jul 28 , 2025 | 05:03 AM

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘లడ్కీ బహిన్‌ యోజన’ పథకంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి.

Maharashtra: మహిళా స్కీమ్‌ సొమ్ము తినేస్తున్న మగాళ్లు!

  • మహారాష్ట్రలో ‘లడ్కీ బహిన్‌’ కుంభకోణం

  • లబ్ధిదారులుగా 14,298 మంది

  • పురుషులు.. రిజిస్ట్రేషన్‌లో అక్రమాలు

  • మహిళలుగా నమోదు చేసుకున్న వైనం

  • ఇంకా లక్షలాదిగా ‘అనర్హ’ లబ్ధిదారులు

ముంబై, జూలై 27: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘లడ్కీ బహిన్‌ యోజన’ పథకంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ స్కీమ్‌ కింద మహిళలు లబ్ధి పొందాల్సి ఉండగా.. దాదాపు 14 వేల మందికి పైగా పురుషులు మోసపూరితంగా డబ్బులు కాజేశారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను తప్పుదోవ పట్టించి, మహిళలుగా పేర్లను నమోదు చేసుకొని, ‘లడ్కీ బహిన్‌ యోజన’ కింద లబ్ధి పొందారు. 14,298 మంది పురుషులకు రూ.21.44 కోట్ల మేర అందినట్లు మహిళా, శిశు అభివృద్ధి శాఖ (డబ్ల్యూసీడీ) ఆడిట్‌లో వెల్లడైంది. పథకాన్ని ప్రారంభించిన దాదాపు 10 నెలల తర్వాత ఈ ఘరానా మోసం బయటపడడం గమనార్హం. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.


పేద మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు లడ్కీ బహిన్‌ స్కీమ్‌ను ప్రారంభించామన్నారు. తప్పుడు మార్గంలో లబ్ధి పొందిన పురుషుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. మరికొన్ని విధాలు గా ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆడిట్‌లో తేలింది. పెద్ద సంఖ్యలో అనర్హుల నమోదు కారణంగా రూ.1,640 కోట్ల నష్టం జరిగిందని డబ్ల్యూసీడీ అంచనా వేసింది. ఈ పథకాన్ని ఒక్కో కుటుంబంలో ఇద్దరికే పరిమితం చేయగా.. 7.97లక్షల మందికి పైగా మహిళలు తమ కుటుంబాల నుంచి మూడో సభ్యురాలిగా నమోదు చేసుకున్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.1,196కోట్ల నష్టం వాటిల్లింది. గరిష్ఠ వయసు పరిమితి 65 ఏళ్లు పెట్టగా.. 65 ఏళ్లు దాటిన 2.87 లక్షల మంది స్కీమ్‌ లబ్ధి పొందారు. దీని వల్ల రూ.431.7 కోట్ల నష్టం జరిగింది. స్కీమ్‌లో అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలనే డిమాండ్లు వస్తున్నాయి.

Updated Date - Jul 28 , 2025 | 05:03 AM