Rohingyas: రోహింగ్యాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర ప్రశ్నలు
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:41 PM
రోహింగ్యాల విషయమై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. వీరిని శరణార్థులుగా ప్రకటించేందుకు అర్హులేనా.. లేదా చొరబాటుదారులుగా..

ఢిల్లీ, జులై 31: రోహింగ్యాల విషయమై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. రోహింగ్యాల విషయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ(గురువారం) విచారణ చేపట్టింది. రోహింగ్యాలను శరణార్థులుగా ప్రకటించేందుకు అర్హులేనా? అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. అసలు రోహింగ్యాలు చొరబాటుదారులో.. శరణార్థులో తేల్చాలని ఆదేశించింది. ఒకవేళ రోహింగ్యాలు చొరబాటుదారులైతే బహిష్కరిస్తున్నారా? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు, రోహింగ్యాల బహిష్కరణకు కేంద్రం, రాష్ట్రాలు తీసుకున్న చర్యలేంటని కూడా అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని కోరింది.
న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపంకర్ దత్తా ఇంకా ఎన్.కోటీశ్వర్ సింగ్ లతో కూడిన బెంచ్ ఈ అంశంపై విచారణ జరిపింది. రోహింగ్యాలు చొరబాటుదారులో.. శరణార్థులో తేలాక ఇతర సమస్యలు, పర్యవసానాల గురించి మాట్లాడవచ్చని అభిప్రాయపడింది. ఒకవేళ రోహింగ్యాలు శరణార్థులుగా ప్రకటిస్తే, వారికి ఏ రక్షణలు లేదా హక్కులు ఉన్నాయో చెప్పాలని బెంచ్ ప్రశ్నించింది. అక్రమ వలసదారులైతే, వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహిష్కరించే చర్య సరైనదేనా? వారిని నిరవధికంగా నిర్బంధించడం లేదా బెయిల్‌పై విడుదల చేయవచ్చా.. అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
రోహింగ్యాల నిర్బంధమే కీలక అంశమని పిటిషనర్ల తరఫున న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం.. రోహింగ్యాలకు సంబంధించి దాఖలైన అనేక పిటిషన్లను మూడు విభాగాలుగా విభజించి విచారణ చేపడతామని పేర్కొంది. ప్రతి బుధవారం వీటిని విచారించేందుకు సమయాన్ని కేటాయిస్తామని పేర్కొంది. కాగా, రోహింగ్యాలు దేశంలో 12 రాష్ట్రాల్లో నివసిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ, ఢిల్లీ, యూపీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడులో అధికంగా, మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువగా రోహింగ్యాలు ఉన్నట్టు సమాచారం.
Also Read:
ఓవల్ టెస్ట్‌లో భారత్‌కు వరుణుడి శాపమా, వరమా?
జీపు కింద పడ్డ మొసలి.. చివరకు ఏం చేసిందో చూస్తే..
For More Telangana News and Telugu News..