Share News

Nara Lokesh: జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:26 PM

సొంత తల్లి, చెల్లి మీద ఎవ్వడైనా కేసులు పెడతారా..? అంటూ వైఎస్ జగన్ వ్యవహార శైలిని నారా లోకేష్ నిలదీశారు. ఆ కేసులో గెలిచానని సంబరాలు చేసుకుంటారా..? అంటూ జగన్ వైఖరిపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.

Nara Lokesh: జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
AP IT Minister Nara Lokesh

అమరావతి, జులై 31: ఆంధ్రప్రదేశ్‌‌కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని ఏపీ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్‌ ఆరోపించారు. రేపో మాపో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిపోతుందంటూ సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్ చేశారని తెలిపారు. మురళీకృష్ణకు వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ ఈ-మెయిళ్లు పెట్టారని వివరించారు. వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ సంస్థతో మురళీకృష్ణకు సంబంధమున్నట్లు తెలిసిందన్నారు. ఇదే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని ఆయన అభివర్ణించారు.


గురువారం నాడు అమరావతిలో మంత్రి నారా లోకేష్ విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో ఏపీ ఎంతో నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారని మండిపడ్డారు. అత్యధిక పన్నులు చెల్లింపు సంస్థగా ఉన్న అమర్‌ రాజా... పక్క రాష్ట్రానికి పారిపోయేలా చేశారని ధ్వజమెత్తారు. అంతేకాదు.. లులూ గ్రూప్‌ను సైతం ఏపీ నుంచి జగన్‌ తరిమేశారని చెప్పారు.


ఏపీని క్లస్టర్లుగా విభజించి.. అభివృద్ధి..

ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఏపీ బ్రాండ్‌ను తిరిగి సాధించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఏపీలో పెద్దఎత్తున డేటా సెంటర్లు రానున్నాయని తెలిపారు. ఆ క్రమంలో రాష్ట్రంలో టాటా ఇన్నోవేషన్‌ హబ్స్‌ ఏర్పాటు కానుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించి.. అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణపై దృష్టి సారించినట్లు వివరించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీకి బ్రాండ్‌ తిరిగొచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ హయాంలో ఏకపక్షంగా సింగపూర్‌ ఒప్పందాలు రద్దు చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో సింగపూర్‌ ప్రభుత్వంపై అవినీతి ముద్ర వేశారని గుర్తు చేశారు.


దేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్..

రాజధాని అమరావతి సంయుక్త అభివృద్ధికి సింగపూర్‌ అంగీకారం తెలిపిందన్నారు. సింగపూర్‌ పర్యటనలో రూ.45వేల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. సింగపూర్‌లో నాలుగు రోజుల్లో సీఎం చంద్రబాబు 26 మీటింగ్స్‌ నిర్వహించారని వివరించారు.

19 వన్‌ టూ వన్‌ మీటింగ్స్‌లో తాను సైతం పాల్గొన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌, డేటా సెంటర్స్‌ ఏర్పాటుకానున్నాయని చెప్పారు. విశాఖను ఐటీ పటంలో పెట్టాలని తాము నిర్ణయించామని తెలిపారు. టీసీఎస్‌కు రూ.99పైసల చొప్పున భూమి కేటాయించామని మంత్రి నారా లోకేష్ వివరించారు.


ఎమర్జెన్సీ ఉంటే..

వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్రంలో ఎమర్జెన్సీ వాతావరణం ఉందని విమర్శించారు. దీనిపై నారా లోకేష్ తనదైన శైలిలో ప్రశ్నించారు. ఎమర్జెన్సీ వాతావరణం ఉంటే అసలు జగన్ బయటకు రాగలరా..? అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లేసి కట్టలేదా..? అని గుర్తు చేశారు. భద్రతగా పోలీసులను పెడితే.. పోలీసులను మొహరించారని అంటారని.. పోని పోలీసులను పెట్టకుంటే భద్రత ఇవ్వలేదని ఆరోపిస్తారని మండిపడ్డారు.


జగన్ అరెస్ట్‌పై లోకేష్ ఆసక్తికర కామెంట్

సొంత తల్లి, చెల్లి మీద ఎవ్వడైనా కేసులు పెడతారా..? అంటూ వైఎస్ జగన్ వ్యవహార శైలిని ఈ సందర్భంగా నిలదీశారు. ఆ కేసులో గెలిచానని సంబరాలు చేసుకుంటారా..? అంటూ సందేహం వ్యక్తం చేశారు. తల్లి మీద కేసు పెట్టి సంబరాలు చేసుకునే ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డే అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వ్యక్తి అసలు నాయకుడిగా పనికొస్తాడా..? అంటూ నారా లోకేష్ అనుమానం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్ అరెస్ట్ అవుతారా? అంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ ఆసక్తికర కామెంట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.


లిక్కర్‌ స్కాంపై సంచలన వ్యాఖ్యలు..

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు లోకేష్. ఒక లిక్కర్‌ కంపెనీ రూ.400కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసిందని చెప్పారు. బంగారంతో లిక్కర్‌ తయారు చేయలేరు కదా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి వెళ్లింది? అని నారా లోకేష్‌ ప్రశ్నించారు. పెద్దిరెడ్డి కంపెనీకి ఆదాన్‌ సంస్థ నుంచి డబ్బులొచ్చాయని చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఛాలెంజ్‌ చేస్తున్నా.. దమ్ముంటే కాదని ఈ వ్యాఖ్యలను ఖండించాలంటూ ఆయనకు మంత్రి నారా లోకేష్‌ సవాల్ విసిరారు.


బనకచర్ల ప్రాజెక్ట్‌పై కామెంట్స్..

బనకచర్ల పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే జల వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. మిగులు జలాలు వాడుకుంటే అభ్యంతరం ఏంటంటూ.. బనకచర్ల ప్రాజెక్ట్ అంశంలో అడ్డుపడుతున్న వారిని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.

సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే అందులో తప్పేంటని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించే ముందు అనుమతులు ఉన్నాయా? అని సందేహం వ్యక్తం చేశారు. దిగువ రాష్ట్రంలో ప్రాజెక్టు కడితే.. ఎగువ రాష్ట్రానికి వచ్చిన అభ్యంతరమేంటని ప్రశ్నించారు. తెలంగాణ దాటి ఏపీ భూ భాగంలోకి వచ్చే నీటిని వాడుకుంటే తప్పేంటన్నారు. ఏపీకి ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా? అంటూ మంత్రి లోకేష్‌ నిలదీశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం స్కామ్‌లో స్వాధీనం చేసుకున్న సొమ్ముపై కోర్టు కీలక నిర్ణయం

బావిలో దూకాల్సింది నువ్వే.. : ఎమ్మెల్యే కోటంరెడ్డి కౌంటర్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 07:30 PM