Share News

ఓటరు కార్డుకు ఆధార్‌, మొబైల్‌ లింక్‌

ABN , Publish Date - Mar 13 , 2025 | 05:58 AM

ఓటర్ల గుర్తింపు సక్రమంగా జరిగేలా ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్‌, మొబైల్‌ నంబర్లతో లింక్‌ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) అధికారులను ఆదేశించింది.

ఓటరు కార్డుకు ఆధార్‌, మొబైల్‌ లింక్‌

అన్ని రాష్ట్రాల సీఈవోలకు ఈసీ ఆదేశం!

న్యూఢిల్లీ, మార్చి 12: ఓటర్ల గుర్తింపు సక్రమంగా జరిగేలా ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్‌, మొబైల్‌ నంబర్లతో లింక్‌ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల(సీఈవోల)కు సర్క్యులర్‌ను ఈసీఐ జారీ చేసినట్టు తాజాగా ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది. దీంతోపాటు ఈనెల 4న నిర్వహించిన సీఈవోల కాన్ఫరెన్స్‌లో ‘ఓపెన్‌ రిమార్క్స్‌ ఆఫ్‌ సీఈసీ’ పేరిట సీఈవోలందరికీ పంపిణీ చేసిన పత్రాల్లోనూ అవే ఆదేశాలు ఉన్నాయని, ఆ ఆదేశాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సర్క్యులేట్‌ చేయాలని సీఈవోలకు నిర్దేశించారని పేర్కొంది. ‘ఓటర్ల గుర్తింపు సక్రమంగా ఉండేందుకు ఓటరు కార్డుతో ఆధార్‌, మొబైల్‌ నంబర్లను అనుసంధానించే అన్ని ప్రయత్నాలూ చేయాలి’ అని సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసినట్టు తెలిపింది.


దీంతోపాటు జనన, మరణాల నమోదు అధికారులతో సమన్వయం చేసుకొంటూ ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను అప్‌డేట్‌ చేస్తుండాలని కూడా సీఈసీ నిర్దేశించినట్టు పేర్కొంది. అలాగే, 18 ఏళ్ల వయసు దాటిన భారత పౌరులందరూ తప్పనిసరిగా ఓటర్లుగా నమోదై ఉండేలా ఇంటింటి సర్వే సమయంలో అందరు బీఎల్‌వోలూ(బూత్‌ స్థాయి అధికారులు) కృషి చేయాలని సీఈసీ ఆదేశించారు. కాగా, ఓటరు నమోదుకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరి కాదని 2022లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణలో ఈసీఐ స్పష్టం చేసింది. దానికి భిన్నంగా తాజా ఆదేశాలు ఉన్నాయి.

Updated Date - Mar 13 , 2025 | 05:58 AM