Rahul Gandhi: ఈసీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:26 AM
కేంద్ర ఎన్నికల కమిషన్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల సరళిని ఉదహరించిన ఆయన ఈసీలో ఏదో భారీ లోపం ఉందని అన్నారు.

అమెరికా పర్యటనలో ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల కమిషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీలో వ్యవస్థాగతంగా ఏదో భారీ లోపం ఉందని ఆరోపించారు. బోస్టన్‌లో స్థానిక భారత సంతతి వ్యక్తులను ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో రాహుల్ గాంధీ ఈ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ సరళిని ఉదహరించారు.
‘‘మహారాష్ట్రలోని వారి కంటే ఎక్కువ మంది ఎన్నికల్లో ఓటు వేశారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 మధ్య 65 లక్షల మంది ఓటు వేశారు. ఇది భౌతికంగా అసాధ్యం. ఈసీ రాజీ పడినట్టు దీంతో స్పష్టమవుతోంది. వ్యవస్థలో ఏదో భారీ లోపం ఉంది’’ అని అన్నారు.
మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో తయారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై గతంలోనే ఈసీ స్పందించింది. జనవరి 6-7 న ప్రకటించిన స్పెషల్ సమ్మరీ రివిజన్ జాబితాకు సంబంధించి రీప్రజెంటేషన్ పిపుల్స్ యాక్ట్ సెక్షన్ 24 కింద అప్పీల్స్ గానీ సెక్షన్ 22 కింద ఓటర్ల జాబితాలో సవరింపులు, లేదా కొత్త వారిని చేర్చుకోవడం వంటి అభ్యర్థనలేవీ పెద్దగా రాలేదు’’ అని ఈసీ వర్గాలు తెలిపాయి. ఈసీ ప్రకారం, ఓటర్ల జాబితాను సమీక్షించి ముసాయిదా జాబితాను విడుదల చేయడాన్ని స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటారు. ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో కొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చుకోవడం, డూప్లికేట్ ఓటర్లు, మృతి చెందిన వారిని జాబితా నుంచి తొలగించడం చేస్తుంటారు. మహారాష్ట్రలో కేవలం 89 అప్పీల్స్ వచ్చినట్టు ఈసీ పేర్కొంది.
ఇక రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. భారతీయుల నమ్మకాన్ని రాహుల్ పొందలేక పోయారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
పాడుబడ్డ ఇంట్లో అనాథ చిన్నారి.. కాపాడిన నటి దిశా పటానీ సొదరి
ఫేక్ డాక్టర్‌తో ఇంట్లో ఆపరేషన్.. మహిళ ప్రాణం పాయే..
Brides Mother: పచ్చి మోసం.. పిల్ల అని చెప్పి తల్లితో పెళ్లి చేశారు..