Dreamliner: డ్రీమ్‌లైనర్ సురక్షితం.. ఎంపీల ప్యానెల్‌కు వివరించిన ఎయిరిండియా
ABN , Publish Date - Jul 08 , 2025 | 09:02 PM
భద్రతా విధానాలపై ఏవియేషన్ అధికారులను ఎంపీలు ప్రశ్నించారని, బీసీఏఎస్ తక్షణ ఆడిట్ జరపాలని పేర్కొన్నారని విశ్వసనీయ వర్గాల సమచారం. డీజీసీఏ పనితీరును కూడా ఎంపీలు ప్రశ్నించారు.

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ (Air India) మోడల్ సురక్షితమైనదేనని ఎయిరిండియా (Air India) తెలిపింది. ఆపరేషన్‌లో ఉన్న సురక్షిత విమానాల్లో ఇది ఒకటని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1000కు పైగా డ్రీమ్‌లైనర్లు నడుస్తున్నాయని వివరించింది. విమాన ప్రమాదం నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఎయిరిండియా ప్రతినిధులు మంగళవారంనాడు ఈ విషయాలు వెల్లడించారు.
ఈ సమావేశంలో ఎయిరిండియా సీఈఓ విల్సన్ క్యాంప్‌బెల్‌తో పాటు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసీఏ) ఉన్నతాధికారులు, డెరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ), ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), బ్యూరో అఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇండిగో, అకాసా ఎయిర్ సహా పలు ఎయిర్‌లైన్స్ సీనియర్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
భద్రతా విధానాలపై ఏవియేషన్ అధికారులను ఎంపీలు ప్రశ్నించారని, బీసీఏఎస్ తక్షణ ఆడిట్ జరపాలని పేర్కొన్నారని విశ్వసనీయ వర్గాల సమచారం. డీజీసీఏ పనితీరును కూడా ఎంపీలు ప్రశ్నించారు. ఇటీవల ఎదురవుతున్న భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం విమానం టిక్కెట్ల ధరల్లో పెరుగుదల రెగ్యులేటరీ వైఫల్యం అనుకోవచ్చా అని ప్రశ్నించారు. క్రాష్ ప్రోబ్ కమిటీకి ఎంపిక చేసే విధానం ఏవిధంగా ఉంటుంది? విచారణలో విదేశీ ఏవియేషన్ నిపుణులను సంప్రదించారా? అని ఎంపీలు ప్రశ్నించారు. విమాన ప్రమాద ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని, అధికారిక దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని ఎయిరిండియా ప్రతినిధులు ఎంపీల ప్యానెల్‌కు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
పాక్‌వన్నీ బూటకాలే.. కూలింది ఒక రాఫెలే, అది కూడా..
ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి