Dassault CEO: పాక్‌వన్నీ బూటకాలే.. కూలింది ఒక రాఫెలే, అది కూడా..
ABN , Publish Date - Jul 08 , 2025 | 08:06 PM
పహల్గాం ఘటనలో పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయానికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మే 7న పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సేన విరుచుకుపడింది. ఈ క్రమంలోనే మూడు రాఫెల్ జెట్లతో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను తాము కూల్చేసినట్టు పాక్ ప్రకటించుకుంది.

న్యూఢిల్లీ: 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) సమయంలో భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్ యుద్ధ విమానాలను (Rafale fighter aircraft) కూల్చివేశామని పాకిస్థాన్ చేసిన ప్రకటనను దసో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎరిక్ ట్రాపియెర్ తోసిపుచ్చారు. ఇండియా ఒక రాఫెల్‌నే కోల్పోయిందని, అది కూడా ఎత్తైన ప్రాంతంలో సాంకేతిక లోపం తలెత్తడం కారణంగానే జరిగిందని స్పష్టత ఇచ్చారు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర ఘటనలో పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయానికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మే 7న పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సేన విరుచుకుపడింది. ఈ క్రమంలోనే మూడు రాఫెల్ జెట్లతో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను కుప్పకూల్చినట్టు పాక్ ప్రకటించుకుంది. అయితే ఇందుకు ఎలాంటి సాక్ష్యాలను చూపించలేకపోయింది.
కాగా, రాఫెల్ విమానాలను తయారు చేసే ఫ్రెంచ్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తాజాగా పాక్ వాదనను కొట్టివేశారు. ఇది పూర్తిగా అవాస్తవని అన్నారు. ఒక రాఫెల్‌ను భారత్ కోల్పోయిందని, అది కూడా శత్రువు వల్ల కాదని అన్నారు. అదికూడా అధిక ఎత్తులో సాంకేతిక లోపం తలెత్తి కుప్పకూలిందని చెప్పారు. స్పెక్టా ఎలక్ట్రానిక్ వార్‌వేర్ సిస్టంలో కూడా ఆపరేషన్ సింధూర్‌లో శత్రు పక్షాల చర్యలు ఎక్కడా రికార్డు కాలేదని తెలిపారు. తమ విమానాల ఆపరేషన్లలో జరిగే నష్టాలను డస్సాల్ట్ ఎప్పుడూ దాచిపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.
రాఫెల్స్ మాట కరెక్ట్ కాదు: ఆర్‌కే సింగ్
కాగా, రాఫెల్ జెట్లను కూల్చేసామని పాకిస్థాన్ వైమానికి దళం ప్రకటించుకోవడం సరికాదని భారత రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ తెలిపారు. 'మీరు రాఫెల్స్ అంటూ బహువచన ప్రయోగం చేశారు. అది కరెక్ట్ కాదని నేను కచ్చితంగా చెప్పగలను. ప్రాణనష్టం, ఆస్తినష్టంలో భారత్ కంటే చాలా రెట్లు పాకిస్థాన్ నష్టపోయింది. 100 మందికి పైగా టెర్రరిస్టులను మట్టుబెట్టాం' అని ఆర్కే సింగ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక
రాష్ట్రపతుల పేర్లు తప్పుగా పలికిన ఖర్గే.. క్షమాపణకు బీజేపీ డిమాండ్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి