COVID-19 Vaccines: కొవిడ్ టీకాలు పూర్తి సురక్షితం
ABN , Publish Date - Jul 03 , 2025 | 06:08 AM
వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుతో పలువురు మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. క్రికెట్ ఆడుతూ, పెళ్లి ఊరేగింపులో నృత్యం చేస్తూ, వేదికపై పాట పాడుతూ...

ఆకస్మిక మరణాలతో వాటికి సంబంధం లేదు: కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 2: వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుతో పలువురు మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. క్రికెట్ ఆడుతూ, పెళ్లి ఊరేగింపులో నృత్యం చేస్తూ, వేదికపై పాట పాడుతూ... ఇలా ఎక్కడి వాళ్లు అక్కడే కుప్పకూలిపోయి క్షణాల్లోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. కరోనా తర్వాతే ఈ తరహా మరణాలు ఎక్కువ కావడంతో వారు తీసుకున్న కొవిడ్ టీకాలే దీనికి కారణమని ప్రచారం సాగుతోంది. మరోవైపు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో గత 40 రోజుల్లోనే 24 మంది గుండె సంబంధిత సమస్యలతో హఠాత్తుగా మృతిచెందడంతో వ్యాక్సిన్ ప్రభావంపై ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు, కొవిడ్-19 టీకాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పలు జాతీయ వైద్య సంస్థలు నిర్వహించిన పరిశోధనల్లో సైతం ఇదే విషయం నిర్ధారణ అయిందని తెలిపింది.
‘కొవిడ్ అనంతరం ప్రత్యేకించి 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారిలో ఆకస్మిక మరణాలకు గల కారణాలపై ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీ పరిశోధనలు చేశాయి. కొవిడ్ టీకాకు, ఈ మరణాలకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని ఈ అధ్యయనాల్లో తేలింది. భారత్‌లోని కొవిడ్ టీకాలు సురక్షితమైనవని పరిశోధనలు ధ్రువీకరించాయి. కొవిడ్ తదనంతర ఇబ్బందులతో పాటు జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, గతంలో ఉన్న అనారోగ్యం వంటివి కూడా కార్డియాక్ అరెస్టుకు దారితీసి ఉండొచ్చని అధ్యయనాల్లో వెల్లడైంది’ అని కేంద్రం వివరించింది. కాగా, 2021 అక్టోబరు నుంచి 2023 మార్చి మధ్య కాలంలో ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించిన్పటికీ ఆకస్మికంగా మరణించిన వ్యక్తులకు సంబంధించిన డేటాను ఐసీఎంఆర్ విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది.