Surge Pricing: రద్దీ వేళల్లో రెండింతల చార్జీ
ABN , Publish Date - Jul 03 , 2025 | 05:50 AM
ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవల (అగ్రిగేటర్) సంస్థలు రద్దీ వేళల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవల
సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి
సరైన కారణం చెప్పకుండా రైడ్ రద్దు చేస్తే.. చార్జీ మొత్తంలో 10 శాతం జరిమానా
యాప్‌లో సూచించిన మార్గంలోనే ప్రయాణం
మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 2: ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవల (అగ్రిగేటర్) సంస్థలు రద్దీ వేళల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే సమయంలో రద్దీ ఉండని సాధారణ వేళల్లో కనీస మొత్తం (బేస్ ఫేర్)లో 50శాతం కంటే తక్కువ చార్జీ తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీనితోపాటు పలు కీలక అంశాలపై స్పష్టత ఇస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంగళవారం ‘మోటారు వాహన సేవా సంస్థల (అగ్రిగేటర్) మార్గదర్శకాలు-2025’ను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం..
క్యాబ్ సంస్థలు కనీస చార్జీల్లో సగం (50శాతం తక్కువ) నుంచి గరిష్టంగా రెండింతల వరకు వసూలు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏదైనా నిర్ధారిత దూరం ప్రయాణానికి (రైడ్‌కు) రూ.100 బేస్ ఫేర్ అనుకుంటే.. డిమాండ్ ఉండని సమయాల్లో కనీసం రూ.50 కంటే తక్కువ చార్జీ చేయవద్దు. ఎక్కువ రద్దీ ఉండే సమయాల్లో గరిష్టంగా రూ.200కు మించి వసూలు చేయవద్దు. (ఇంతకు ముందు గరిష్ట చార్జీ ఒకటిన్నర రెట్ల వరకే ఉండేది).
క్యాబ్ బుక్ అయిన తర్వాత డ్రైవర్ సరైన కారణం చెప్పకుండా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే.. ఆ రైడ్ చార్జీల్లో 10ు (రూ.100కు మించకుండా) జరిమానాగా చెల్లించాలి. ప్రయాణికులు రద్దు చేసుకున్నా ఇదే రూల్ వర్తిస్తుంది.
బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికుడిని పికప్ చేసుకునేందుకు క్యాబ్ ప్రయాణించే దూరం 3 కిలోమీటర్లలోపు ఉన్నప్పుడు దానికి ఎలాంటి చార్జీ విధించకూడదు.
క్యాబ్ డ్రైవర్లు సంబంధిత సంస్థ యాప్‌లో సూచించిన మార్గంలో మాత్రమే ప్రయాణించేలా చర్యలు చేపట్టాలి. ఒకవేళ మార్గం మార్చితే వెంటనే ఆటోమేటిగ్గా కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేసే ఏర్పాట్లు ఉండాలి.
క్యాబ్ సంస్థలు ప్రయాణికుల కోసం కనీసం రూ.5 లక్షలకు బీమా తీసుకోవాలి. డ్రైవర్లకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
క్యాబ్ సంస్థలు ఎనిమిదేళ్లు దాటిన (రిజిస్ట్రేషన్ నాటి నుంచి) వాహనాలను సర్వీసులో ఉంచకూడదు. ప్రతి వాహనంలో లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరిగా అమర్చాలి.
వ్యక్తిగత ద్విచక్ర వాహనాలను క్యాబ్/ట్యాక్సీ సేవల కోసం వినియోగించేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. దీనిపై రాష్ట్రాలు మార్గదర్శకాలు ఇవ్వాలని, ఆ సేవలు అందించే సంస్థల నుంచి చార్జీలు వసూలు చేసుకోవచ్చని సూచించింది.
రాష్ట్రాలు 3నెలల్లోగా తమ మార్గదర్శకాలను అమలుపై ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది.