GST Reduction: నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గుదల?
ABN , Publish Date - Jul 03 , 2025 | 05:53 AM
మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఈ ఏడాది ఆదాయ పన్ను రాయితీలతో ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయా వర్గాలకు మరింత ఉపశమనం కల్పించేందుకు సిద్ధమవుతోంది.

12 నుంచి 5 శాతానికి తగ్గించే యోచనలో కేంద్రం
పూర్తిగా ఎత్తేసే ప్రతిపాదన కూడా పరిశీలన
రాబోయే జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం
టూత్‌పే్‌స్ట, నెయ్యి, సబ్బులు, పాదరక్షలు, దుస్తులు, వాషింగ్ మెషిన్లు తదితర వస్తువులు ఇక చౌక!
న్యూఢిల్లీ, జూలై 2: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఈ ఏడాది ఆదాయ పన్ను రాయితీలతో ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయా వర్గాలకు మరింత ఉపశమనం కల్పించేందుకు సిద్ధమవుతోంది. మధ్యతరగతి, అల్పాదాయ కుటుంబాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించడం ద్వారా ఊరట కల్పించనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్న నిత్యావసర వస్తువులపై పూర్తిగా పన్నును తొలగించడం లేదా చాలా వస్తువులను 5శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని వెల్లడించాయి. టూత్‌పే్‌స్ట, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, వంట పాత్రలు, నెయ్యి, సబ్బులు, చిరుతిళ్లు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు, గీజర్లు, తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషీన్లు, సైకిళ్లు, రూ.1000 కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు, రూ.500-1000 ధర కలిగిన పాదరక్షలు, తదితర వస్తువులపై జీఎస్టీని తగ్గించనున్నట్లు సమాచారం. ఈ తగ్గింపు అమల్లోకి వస్తే చాలా వస్తువులు చౌకగా దొరుకుతాయి. సామాన్యులు వాడే ఈ నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించడం వల్ల ప్రభుత్వంపై రూ.40-50వేల కోట్ల భారం పడనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ భారాన్ని మోసేందుకు సర్కారు సిద్ధమవుతోందనీ పేర్కొన్నాయి. ప్రజల వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకే జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. వస్తువుల ధరలు తగ్గితే విక్రయాలు పెరుగుతాయని, ఫలితంగా జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జీఎస్టీ రేట్లలో మార్పులు చేస్తామన్న సంకేతాలు ఇచ్చారు. నిత్యావసర వస్తువులపై పన్నులను హేతుబద్ధీకరిస్తామని, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, జీఎస్టీ తగ్గింపుపై ఈ నెలలో జరగబోయే 56వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
12% జీఎస్టీ పరిధిలోని వస్తువులు ఇవే..
టూత్‌పౌడర్, హెయిర్ ఆయిల్, సబ్బులు (కొన్ని విభాగాలపై 18ు ఉంది), నెయ్యి, టూత్‌పే్‌స్ట (కొన్ని బ్రాండెడ్ రకాలపై 12ు, ఇతర పేస్ట్‌లపై 18ు), గొడుగులు, కుట్టు మిషన్లు, వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫయర్లు (నాన్ ఎలక్ట్రిక్), ప్రెషర్ కుక్కర్లు, అల్యూమినియం, స్టీల్‌తో చేసిన వంట పాత్రలు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు, గీజర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు (తక్కువ సామర్థ్యం, వాణిజ్యేతర), వాషింగ్ మెషీన్లు (తక్కువ సామర్థ్యం), సైకిళ్లు, దివ్యాంగుల వాహనాలు, రెడీమేడ్ దుస్తులు (రూ.1000పైన ధర కలిగినవి), పాదరక్షలు (రూ.500-1000), టీకాలు, హెచ్‌ఐవీ, హెపటైటిస్, టీబీ డయాగ్నస్టిక్ కిట్లు, కొన్ని ఆయుర్వేద, యునానీ మందులు, డ్రాయింగ్, కలరింగ్ పుస్తకాలు, రెడీ మిక్స్ కాంక్రీట్, ప్రి-ఫ్యాబ్రికేటెడ్ భవనాలు, వ్యవసాయ పనిముట్లు, ప్యాకేజ్డ్ ఆహారం, సోలార్ వాటర్ హీటర్లు. కాగా, సిగరెట్లు, విలాసవంతమైన కార్లు, కార్బొనేటెడ్ డ్రింక్స్ తదితర వస్తువులపై జీఎస్టీని భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రాలూ అంగీకరించాలి..
జీఎస్టీ తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం మాత్రమే ముందుకు వస్తే సరిపోదు. ఆయా ప్రతిపాదనలపై రాష్ట్రాల మధ్య కూడా ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంటుంది. పన్ను తగ్గింపునకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. కౌన్సిల్‌లో ప్రతి రాష్ట్రానికీ ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుంచి కొంత వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జీఎస్టీ కౌన్సిల్ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే ఓటింగ్ జరిగింది. మిగిలిన అన్ని నిర్ణయాలూ ఏకగ్రీవంగానే తీసుకోవడం విశేషం.