రోబోలకూ స్పర్శ అనుభూతి!
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:55 AM
యంత్రాలకు సైతం చర్మాన్ని అమర్చి వాటికి మానవ రూపాన్ని ఇవ్వడమే కాకుండా అవికూడా స్పర్శను గుర్తించేలా.. అమెరికాలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.

వేడి, నొప్పిని గుర్తించే రోబోటిక్ చర్మం అభివృద్ధి
కేంబ్రిడ్జ్ పరిశోధకుల ఆవిష్కరణ
ఈ చర్మంతో సున్నితమైన, తెలివైన సెన్సర్‌గా మారనున్న రోబోటిక్ చేయి
వాషింగ్టన్, జూన్ 17: యంత్రాలకు సైతం చర్మాన్ని అమర్చి వాటికి మానవ రూపాన్ని ఇవ్వడమే కాకుండా అవికూడా స్పర్శను గుర్తించేలా.. అమెరికాలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. వేడిని, నొప్పిని, ఒత్తిడిని సైతం ఫీలయ్యే సరికొత్త రోబోటిక్ చర్మాన్ని వారు సృష్టించారు. సౌకర్యవంతమైన, తక్కువ ధర కలిగిన జెల్ పదార్థంతో తయారు చేసిన ఈ చర్మం... రోబోటిక్ చేతిని సున్నితమైన, తెలివైన సెన్సర్‌గా మారుస్తుంది. విభిన్న సెన్సర్లతో కూడిన ప్యాచ్‌వర్క్‌పై ఆధారపడే ఇతర ఎలాకా్ట్రనిక్ చర్మంలా కాకుండా.. ఈ పదార్థం ఒత్తిడి, ఉష్ణోగ్రత, నొప్పిని సైతం గుర్తించగలదు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్)కు చెందిన పరిశోధకులు ఈ రోబోటిక్ స్కిన్‌ను అభివృద్ధి చేశారు. కరిగించే వీలున్న దీన్ని విభిన్న ఆకారాల్లో రూపొందించవచ్చు. రోబోల కాళ్లు, చేతులు, ముఖం.. ఇలా ఎక్కడ, ఏ ఆకారంలో కావాలన్నా సులువుగా తయారు చేసేలా దీన్ని అభివృద్ధి చేశారు. ఇది మానవ చర్మం అంత సున్నితమైనది కానప్పటికీ.. ఈ పదార్థంలో ఉండే 8.6లక్షల చిన్నచిన్న మార్గాల ద్వారా ఇది సంకేతాలను, వివిధ రకాల స్పర్శలను, ఒత్తిడిని గుర్తించగలదు. కత్తి గాటు వల్ల కలిగే బాధను, వేడి లేదా చల్లగా ఉన్న ఉపరితలాలను గుర్తించగలదు.