Share News

Gujarat: వంతెన కూలి.. నదిలో పడ్డ వాహనాలు

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:03 AM

గుజరాత్‌లోని వడోదర జిల్లాలో నాలుగు దశాబ్దాల క్రితం నాటి భారీ వంతెన కూలిపోయింది. పాద్రా పట్టణం సమీపంలోని మహిసాగర్‌ నదిపై వడోదర-ఆనంద్‌ జిల్లాలను కలుపుతూ నిర్మించిన గంభీర బ్రిడ్జ్‌లో..

Gujarat: వంతెన కూలి.. నదిలో పడ్డ వాహనాలు

  • 13 మంది దుర్మరణం.. గుజరాత్‌లో ఘటన

  • వంతెన 40 ఏళ్ల నాటిది

  • దృఢత్వంపై గతంలోనే స్థానికుల ఫిర్యాదులు పట్టించుకోని అధికారులు

వడోదర, జూలై 9: గుజరాత్‌లోని వడోదర జిల్లాలో నాలుగు దశాబ్దాల క్రితం నాటి భారీ వంతెన కూలిపోయింది. పాద్రా పట్టణం సమీపంలోని మహిసాగర్‌ నదిపై వడోదర-ఆనంద్‌ జిల్లాలను కలుపుతూ నిర్మించిన గంభీర బ్రిడ్జ్‌లో రెండు పియర్ల మధ్య 10-15 మీటర్ల మేర స్లాబు పూర్తిగా కూలిపోయింది. బుధవారం ఉదయం 7:30కు ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో వంతెనపై నుంచి వెళుతున్న వాహనాల్లో రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు, ఆటోరిక్షా, కారు, బైక్‌ సహా కనీసం 12 వాహనాలు వంతెనపై నుంచి నదిలోకి పడిపోయాయి. ఈ ఘటనలో 13మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో నాలుగేళ్లు, రెండేళ్ల వయసున్న తోబుట్టువులు ఉండటం మరింత విషాదం! నాలుగేళ్ల బాలిక మినహా మృతులంతా పురుషులే! మరో తొమ్మిది మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో ఓ మహిళ సహా ఐదుగురికి గాయాలవ్వడంతోవడోదర ఆస్పత్రికి తరలించారు. ఓ బైక్‌ నదిలో పడటంతో దాని మీద ప్రయాణించిన ముగ్గురు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వంతెన కూలిన సమయంలో మరో రెండు వాహనాలకు తృటిలో ప్రమాదం తప్పింది.


జాతీయ విపత్తు నిర్వహణ బృందం (ఎన్డీఆర్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ రూ.2 లక్షల చొప్పున, భూపేంద్ర పటేల్‌ రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు కేంద్రం నుంచి రూ.50 వేలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నారు. వంతెన కూలిపోవడానికి గల కారణాలపై ప్రాథమిక విచారణ కోసం రోడ్లు, భవనాల విభాగానికి చెందిన అధికారులు ఘటనాస్థలికి వెంటనే వెళ్లాలని, విచారణ అనంతరం నివేదిక అందజేయాలని గుజరాత్‌ సీఎం ఆదేశించారు. 900 మీటర్ల పొడవు, 23 పియర్లతో కూడిన గంభీర బ్రిడ్జ్‌ గుజరాత్‌-సౌరాష్ట్ర ప్రాంతాలను కలుపుతుంది. 1985లో దీన్ని నిర్మించారు. వంతెన నిర్వహణకు సంబంఽధించి అవసరమైనప్పుడల్లా మరమ్మతులు నిర్వహిస్తున్నామని గుజరాత్‌ మంత్రి రుషికేశ్‌ పటేల్‌ చెప్పారు. అయితే, వంతెన పరిస్థితిపై స్థానికులు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారని స్థానిక మీడియా పేర్కొంది. దీనిపై కథనాలు ప్రసారమైనట్లు తెలిపింది. అధికారులు పైపైన మరమ్మతులు చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించింది. వంతెన కూలిపోవడంతో వడోదర-ఆనంద్‌ జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.

Updated Date - Jul 10 , 2025 | 05:03 AM