Tejaswi Yadav Raghopur: రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్‌తో దోబూచులాడిన విజయం.. మొదట్లో లీడ్..అంతలోనే..
ABN , Publish Date - Nov 14 , 2025 | 08:05 PM
గెలుపు పక్కా అంటూ ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌కు రాఘోపూర్‌లో బీజేపీ నేత సతీశ్ కుమార్ యాదవ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. మొదట్లో సతీశ్ ఆధిక్యంలోకి రావడం ఆర్‌జేడీ వర్గాలను కాస్త టెన్షన్ పెట్టింది. అయితే, చివరకు తేజస్వీ 14 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో వైశాలి జిల్లా రాఘోపూర్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ విజయం సాధించారు. 1,04,065 ఓట్లు సాధించిన ఆయన.. ప్రత్యర్థి బీజేపీ నేత సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి విజయం తమ కూటమిదేనని ఓట్ల కౌంటింగ్‌కు ముందు ప్రకటించిన తేజస్వీ యాదవ్‌కు నేడు ఊహించని పరిస్థితే ఎదురైంది. గెలుపు ఆయనతో దోబూచులాడింది (Tejaswi Yadav Win Raghopur Constituency).
కౌంటింగ్ మొదట్లో ఫలితాలు తేజస్వీకి అనుకూలంగానే వచ్చాయి. కానీ 20 నిమిషాల తరువాత పరిస్థితి తారుమారైంది. మొదట్లో ఆయనకు 893 ఓట్ల ఆధిక్యం లభించగా 11 గంటలకు పరిస్థితి తలకిందులైంది. బీజేపీ అభ్యర్థి సతీశ్ అనూహ్యంగా పుంజుకుని 1273 ఓట్ల లీడ్‌లోకి వచ్చారు. ఆ తరువాత నుంచీ గెలుపు తేజస్వీతో దోబూచులాడింది. మధ్యాహ్నానికి తేజస్వీ యాదవ్ 2288 ఓట్ల మేర వెనకబడ్డారు. ఆ తరువాత కూడా బీజేపీ నేత సతీశ్ కుమార్ తన ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ వెళ్లారు. 3.30 గంటల సమయంలో ఏకంగా 7 వేల ఓట్ల ముందంజలోకి వచ్చారు. ఆ తరువాత అరగంటకు ఏకంగా 9 వేల ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు.
ఆ తరువాత సీన్ తిరగబడటంతో తేజస్వీకి ఊరట కలిగించింది. సతీశ్ కుమార్ యాదవ్‌పై తేజస్వీ 11 వేల ఓట్ల మెజారిటీతో పైచేయి సాధించడంతో ఆయన మద్దతుదారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 32 రౌండ్ల ఓట్ల కౌంటింగ్ జరగ్గా 29 రౌండ్లకు తేజస్వీ గెలుపు ఖరారయిపోయింది.
రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తేజస్వీ యాదవ్ 2015, 2020 ఎన్నికల్లో సతీశ్ కుమార్ యాదవ్‌పై వరుసగా గెలుపొందారు. తాజా ఎన్నికల్లో కౌంటింగ్ ట్రెండ్స్ కాస్త టెన్షన్ పెట్టినా చివరకు విజయం ఆయననే వరించింది. వాస్తవానికి ఈ నియోజకవర్గం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. 1995, 2000లో జరిగిన ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత మూడు పర్యాయాలు లాలూ సతీమణి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, సతీశ్ యాదవ్ మాత్రం వెనక్కు తగ్గకుండా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ లాలూ కుటుంబ ఆధిపత్యానికి సవాలు విసురుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి విజయం ఖరారైపోయిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
కశ్మీరీలు అందరినీ ఒకే గాటన కట్టొద్దు: ఒమర్ అబ్దుల్లా
గ్రెనేడ్ దాడికి ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి