Big Explosion : ఎర్రకోట దగ్గర భారీ పేలుడు..
ABN , Publish Date - Nov 10 , 2025 | 07:33 PM
ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ..
న్యూఢిల్లీ, నవంబర్ 10: ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది. మరోవైపు పేలుడు కారణంగా పరిసరాల్లో ఉన్న కార్లకు మంటలు అంటుకోగా.. సమీపంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్, ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఘటనా స్థలికి చేరుకుంది. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
హై అలర్ట్..
మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యింది. ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఆయా నగరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. కేంద్రం అలర్ట్‌తో ప్రధాన నగరాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేలుడుపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. ఉగ్రవాద చర్యలను తోసిపుచ్చలేమంటున్నారు.
8 మంది మృతి.. మరికొందరికి తీవ్ర గాయాలు..
పేలుడు ఘటనలో 8 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. తొలుత 15 మందికి తీవ్ర గాయాలవగా వారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మార్గం మధ్యలోనే 8 మంది చనిపోయారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని.. మరికొందరి ఆరోగ్యం నిలకడగా ఉందని లోక్ నాయక్ మెడికల్ సూపరిండెంట్ లోక్ నాయక్ జయ్ ప్రకాష్ నారాయణ్ తెలిపారు.