Liquor Scam: మద్యం కుంభకోణంలో మాజీ సీఎం కుమారుడి అరెస్టు
ABN , Publish Date - Jul 18 , 2025 | 06:37 PM
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో భూపేశ్ బఘేల్ నివాసంలో శుక్రవారం నాడు మరోసారి ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో ఉన్న బఘేల్ నివాసానికి అధికారులు శుక్రవారం ఉదయం చేరుకున్నారు.

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బఘేల్ (Bhupesh Baghel)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గట్టి షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణంలోని మనీ లాండరింగ్ కేసులో భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈడీ శుక్రవారం నాడు అరెస్టు చేసింది. చైతన్య పుట్టిన రోజునాడే ఈడీ ఈ అరెస్టు చేయడంపై భూపేశ్ బఘేల్ విమర్శలు గుప్పించారు.
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో బఘేల్ నివాసంలో శుక్రవారం నాడు మరోసారి ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో ఉన్న బఘేల్ నివాసానికి అధికారులు ఇవాళ ఉదయం చేరుకున్నారు. ఆ నివాసంలో చైతన్య తన తండ్రితో కలిసి ఉంటున్నారు. చైతన్యను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఈడీ వాహనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
2019-2022లో భూపేశ్ బఘేల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని, ఇది రూ.2,160 కోట్ల కుంభకోణమని ఈడీ అధికారులు చెబుతున్నారు. అలాగే ఇందులో చైతన్య బఘేల్ పాత్ర ఉందనీ వారు పేర్కొన్నారు.
పుట్టినరోజు గిఫ్ట్
కాగా, చైతన్య పుట్టినరోజు నాడే ఆయన్ను అరెస్టు చేయడంపై భూపేశ్ స్పందించారు. 'నా కుమారుడికి పుట్టినరోజు నాడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామిక దేశంలోనూ మోదీ, అమిత్‌షా ఇచ్చినట్టు వంటి బర్త్‌డే గిఫ్ట్ ఇంకెవ్వరూ ఇవ్వరు' అని ఎద్దేవా చేశారు. మోదీ, అమిత్‌షా.. ఈడీ అధికారులను పంపారని, వారి మెప్పుపొందేందుకు అధికారులు దాడులు జరిపారని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఒకవైపు ఎన్నికల కమిషన్ సాయంతో బిహార్‌లో ఓటర్లను తొలగిస్తూ ప్రజాసామ్యాన్ని పరిహసిస్తున్నారని, మరోవైపు విపక్ష నేతలను అణచివేసేందుకు ఈడీ, ఐటీ, సీబీఐ, డీఆర్‌ఐలను ఉసిగొలుతున్నారని ఆరోపించారు. ఇవన్నీ ప్రజలకు బాగా తెలుసునని అన్నారు.
ఇవి కూడా చదవండి..
చంగూర్ బాబా రెడ్ డైరీలో పలువురు పొలిటీషియన్ల పేర్లు
భూమికి ఉద్యోగం కేసు.. లాలూకు చుక్కెదురు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి