Share News

Money Case Incident: రూ.200 మోసం చేశాడు.. కట్ చేస్తే 35 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..

ABN , Publish Date - Jul 08 , 2025 | 11:50 AM

రూ. 200 తీసుకుని మోసం చేసిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి.. కేవలం 200 రూపాయలకే పోలీసులు అరెస్ట్ చేశారా? అని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజంగా నిజం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందండోయ్.. ఈ కేసులో నిందితుడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు గానీ.. అసలు ఈ వ్యవహారం అంతా..

Money Case Incident: రూ.200 మోసం చేశాడు.. కట్ చేస్తే 35 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..
Money Case

Bangalore Two Hundred News Case: రూ. 200 తీసుకుని మోసం చేసిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి.. కేవలం 200 రూపాయలకే పోలీసులు అరెస్ట్ చేశారా? అని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజంగా నిజం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందండోయ్.. ఈ కేసులో నిందితుడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు గానీ.. అసలు ఈ వ్యవహారం అంతా 35 ఏళ్ల క్రితం నాటిది. అప్పటి మోసం కేసులో.. నిందితుడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు అరెస్టైన వ్యక్తి వయసు 72 సంవత్సరాలు. మరి.. ఆ 200 రూపాయల చీటింగ్ కేసు వెనుక స్టోరీ ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు..


ప్రస్తుత కాలంలో రూ. 200 రూపాయలు అంటే చాలా చీప్‌గా భావిస్తారు కొందరు. కానీ, 35 ఏళ్ల క్రితం అవే రెండొందల రూపాయలతో ఒక ఇంటికి నెల రోజులు సరిపడా సరుకులు కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఆ రెండు వందల రూపాయలను సంపాదించడానికి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ఆ కాలంలోనే రూ. 200 మోసం చేశాడు. ఓ కేటుగాడు. ఆ మోసంపై బాధిత వ్యక్తి పెద్ద పోరాటమే సాగించాడు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కేసు విచారణ ఇంతకాలం కొనసాగింది. ఎట్టకేలకు 35 ఏళ్ల తరువాత విచారణకు కొలిక్కి వచ్చింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి ముందు అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం.


అది 1990 సంవత్సరం. కర్ణాటకలోని సిర్సి ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల విద్యార్థి వెంకటేష్ మహాదేవ వైద్య అనే యువకుడు ఎంతో కష్టపడి చదువుకునే వాడు. దొరికిన పని చేస్తూనే విద్యాభ్యాసం చేశాడు. ఇలాంటి సమయంలో బి కేశవమూర్తి రావు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం ఆశ చూపాడు. రూ. 200 ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న వెంకటేష్.. అతను చెప్పిన మాటలన్నీ నమ్మాడు. అసలు అతను ఎవరు.. ఉద్యోగం ఎలా ఇప్పిస్తాడు.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే వివరాలేవి తెలుసుకోలేదు. గుడ్డిగా అతన్ని నమ్మేశాడు. రెండొందలు పెద్ద అమౌంట్ కావడంతో వేరే వ్యక్తి వద్ద అప్పు తీసుకువచ్చి కేశవమూర్తికి ఇచ్చాడు. అయితే, ఇప్పుడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. రూ. 200 తీసుకున్న కేశవమూర్తి.. ఆ మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వెంకటేష్.. సిర్సి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ కేసు విచారించిన పోలీసులు.. కేశవమూర్తి జాడ తెలియకపోవడంతో ఫైల్ పక్కన పెట్టేశారు. దీంతో అదికాస్తా మూలన పడిపోయంది. అయితే, తాజాగా ఓ కొరియర్ కారణంగా నిందితుడు కేశవమూర్తి పట్టుబట్టాడు. ఇక్కడ కూడా పెద్ద స్టోరీనే ఉందండోయ్.. అదేంటో కూడా చూసేద్దాం.

Keshavamurty-Rao.jpg


రెండు నెలల క్రితం సిర్సి రూరల్ పోలీస్ స్టేషన్‌కు కొత్త పోలీస్ ఇన్‌స్పెక్టర్ మంజునాథ్ గౌడ వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత కోల్డ్ కేసులను పరిశీలించారు. ఆ సమయంలోనే.. ఓ కేసు ఆయన దృష్టిని ఆకర్షించింది. అది ఈ స్టేషన్‌లోనే పెండింగ్‌లో ఉన్న అతిపురాతన కేసు. రూ. 200 చీటింగ్ కేసు. ఇది ఆసక్తికరంగా అనిపించడంతో.. అసలు కథేంటని కూపీ లాగారు ఇన్‌స్పెక్టర్ మంజునాథ్. ఈ క్రమంలోనే.. కేశవమూర్తి గతంలో నివసరించిన ప్రాంతాల్లో ఆరా తీశారు. కుందాపురలోని తనకున్న నెట్‌వర్క్‌తో కొన్ని వివరాలను తెప్పించుకున్నారు. అయితే, రెండు దశాబద్దాల క్రితమే కేశవమూర్తి పట్టణం విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం అందింది. ఆ తరువాత అతని బంధువులను సంప్రదించి.. కేశవమూర్తి కాంటాక్ట్ నెంబర్ సాధించారు పోలీసులు. ఆ నెంబర్‌ లొకేషన్ ట్రేస్ చేసి బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. కేశవమూర్తి.. బెంగళూరులో కన్నడ కార్యకర్తగా ఉన్నాడని, ఒంటరిగా నివసిస్తున్నాడని గుర్తించారు. అయితే, రూ 200 వ్యవహారం కావడంతో పోలీసులు సిర్సి నుంచి బెంగళూరుకు 400 కిలోమీటర్లు వెళ్లాలా? అని ఆలోచనలో పడ్డారట. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.


జూన్ చివరి వారంలో బెంగళూరులో వార్షిక పోలీస్ క్రీడా సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకి సిర్సి పోలీస్ స్టేషన్ నుంచి కబడ్డీ ఆటగాడైన కానిస్టేబుల్ మారుతి గౌడ హాజరయ్యాడు. అయితే, సమావేశం ముగిసిన తరువాత కేశవమూర్తి గురించి సమాచారం తెలుసుకోవాలని ఇన్‌స్పెక్టర్ ఆదేశించారు. ఈ ఆదేశాల ప్రకారం.. మారుతి క్రీడా సమావేశాలు ముగిసిన తరువాత కేశవమూర్తిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. తమ వద్దనున్న కేశమూర్తి నెంబర్‌కు కాల్ చేసి తనను తాను కొరియర్ ఆఫీస్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. పార్శిల్ వచ్చిందని చెబుతూ.. అతని వివరాలను ధృవీకరించుకున్నాడు. పార్శిల్ తీసుకోవడానికి కొరియర్ ఆఫీస్‌కు రావాల్సిందిగా చెప్పాడు. అది నమ్మిన కేశవమూర్తి.. నేరుగా కొరియర్ ఆఫీస్‌కు వెళ్లాడు. దీంతో కానిస్టేబుల్ మారుతి అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. బెంగళూరు నుంచి సిర్సికి తరలించారు.


కేశవమూర్తి అరెస్ట్‌పై వెంకటేష్ స్పందన..

‘ఫిబ్రవరి 1990లో బీ.కాం. చదువుతున్నాను. తన చదువు కోసం.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడిని. నా తల్లిదండ్రులు కూడా కూలీలు. చాలా కష్టపడేవాళ్లు. ఆ సమయంలో సిర్సిలో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన కేశవమూర్తి కలిశాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి రూ. 200 డిమాండ్ చేశాడు. అప్పట్లో అది చాలా ఎక్కువ. అతని ఆఫర్‌ను నమ్మాను. ఒక వ్యక్తి వద్ద అప్పు తీసుకుని కేశవమూర్తికి ఇచ్చాను. మరుసటి రోజు అతను కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. అంత పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నందుకు చాలా ఏడ్చాను. ఆ తరువాత నా జీవితంలో నేను ముందుకు సాగాను.’ అని వెంకటేశ్ చెప్పుకొచ్చారు.


అయితే, బి.కామ్ పూర్తి చేసిన వెంకటేష్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో పని చేశాడు. బెంగళూరులోని ఒక ఎస్‌బిఐ బ్రాంచ్‌లో చీఫ్ మేనేజర్‌గా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశాడు. ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి కేశవమూర్తి గురించి సమాచారం కొరుతూ వెంకటేష్‌కి అప్పుడప్పుడూ పోలీసుల నుంచి ఫోన్ వచ్చేదట. అయితే, జూలై 2025 మొదటి వారంలో వెంకటేష్‌కు ఎప్పుడూ ఊహించని ఫోన్ కాల్ వచ్చింది. సిర్సి రూరల్ పోలీసులు.. చివరకు కేశవమూర్తి రావును అరెస్టు చేసినట్లు చెప్పారు.


‘అరెస్ట్ చేయడం అటుంచితే.. కేశవమూర్తి మళ్లీ కనిపిస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు.’ అని వెంకటేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయితే, గత వారం కేశవమూర్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. వెంకటేష్‌కు క్షమాపణలు చెప్పాడు. కేశవమూర్తికి ఇప్పుడు 72 సంవత్సరాలు. అప్పుడు రూ. 200 చాలా ఎక్కువ. కానీ, ఇప్పుడు కాదు. మానవతా దృక్పథంతో తాను అతనిని క్షమిస్తున్నట్లు రిటైర్డ్ బ్యాంకర్ వెంకటేష్ చెప్పారు. మరోవైపు కేసును ఉపసంహరించుకోవాలన్న వెంకటేష్ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆ కేసును కొట్టివేయాలని ఆదేశించింది. మొత్తానికి ఈ కేసుకు 35 ఏళ్ల తరువాత ఫుల్‌స్టాప్ పడింది.


Also Read:

వ్యాపారవేత్త హత్య కేసులో బిగ్ అప్డేట్..

ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. అక్కడికక్కడే..

For More National News

Updated Date - Jul 08 , 2025 | 04:56 PM