Share News

Assam: పౌరులకు ఆయుధాలు!

ABN , Publish Date - May 29 , 2025 | 05:19 AM

అసోంలోని హిమంత బిశ్వశర్మ సారధ్యంలోని అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్‌తో సరిహద్దు గల జిల్లాల్లో మారుమూల, ముప్పు గల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల స్వీయ రక్షణకు వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని సీఎం హిమంత బిశ్వశర్మ అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది.

Assam: పౌరులకు ఆయుధాలు!

  • అసోం ప్రభుత్వ సంచలన నిర్ణయం

  • బంగ్లాదేశీలు, అక్రమ వలసదారుల నుంచి ‘స్వదేశీ పౌరుల’ రక్షణకు ఆయుధ లైసెన్సుల మంజూరు

  • జారీ చేసే అధికారం జిల్లా అధికారులకు

గువాహటి, మే 28: అసోంలోని హిమంత బిశ్వశర్మ సారధ్యంలోని అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్‌తో సరిహద్దు గల జిల్లాల్లో మారుమూల, ముప్పు గల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల స్వీయ రక్షణకు వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని సీఎం హిమంత బిశ్వశర్మ అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో అసోం సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దుబ్రీ, నాగావ్‌, మోరిగావ్‌, బార్పేట, సౌత్‌ సాల్‌మరా, గోల్‌పరా జిల్లాల వాసులకు ఈ లైసెన్సులు మంజూరు చేస్తారు. అయితే, అర్హులైన వ్యక్తులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలన్న విషయమై ఆయా జిల్లాల అధికారులు నిర్ణయం తీసుకుంటారని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ‘ఇది చాలా ముఖ్యమైన, సున్నితమైన నిర్ణయం. ఇటీవలి బంగ్లాదేశ్‌ పరిణామాల (హిందువులను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు) నేపథ్యంలో ఈ జిల్లాల్లోని గ్రామాల్లో నివసిస్తున్న భారతీయ స్వదేశీ పౌరుల్లో అభద్రతాభావం నెలకొంది. వారిపై దాడులు చేస్తామంటూ సరిహద్దు ఆవల బంగ్లాదేశ్‌ నుంచి, సొంత గ్రామాల్లోనూ హెచ్చరికలు వస్తున్నాయి.


ఈ నేపథ్యంలోనే మారుమూల, దుర్భల ప్రాంతాల్లో నివసిస్తున్న వారి కి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించింది’ అని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. ‘చట్ట విరుద్ధ బంగ్లాదేశీయులను గుర్తించి బహిష్కరించే ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి భారతీయ స్వదేశీ పౌరులు భయంతో జీవిస్తున్న సందర్భాలు మేం చూశాం. ఈ ప్రాంతాల్లో భారతీయ స్వదేశీ పౌరులు మైనారిటీలుగా జీవిస్తున్నారు. అందుకే వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని మేం నిర్ణయించాం. ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వారికి ప్రభుత్వం సాయం చేయదు. కానీ, ఆయుధాలు కొనుగోలు చేసేందుకు లైసెన్సు మంజూరు చేస్తాం. ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని ఈ ప్రాంత వాసుల నుంచి సుదీర్ఘ కాలంగా డిమాండ్‌ ఉంది’ అని ఆయన తెలిపారు. ‘అసోం కష్టమైన, సున్నితమైన రాష్ట్రం. ఆయుధాల చట్టంలోని నిబంధనల కింద ఆయుధాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని భారతీయ స్వదేశీ పౌరులను ప్రోత్సహిస్తాం’ అని బిశ్వశర్మ చెప్పారు. చట్ట విరుద్ధ హెచ్చరికలు, శత్రువుల ముప్పు ఉన్న ప్రాంతాల్లో స్వదేశీ సామాజిక వర్గాలకు సాధికారత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చొరవ తీసుకున్నది. 1979-85 మధ్య చట్ట విరుద్ధ వలసదారులకు వ్యతిరేకంగా అసోం ఆందోళన సాగినప్పటి నుంచి ఆయుధాల లైసెన్సులు కావాలన్న డిమాండ్‌ ఉందని వెల్లడించారు. కానీ, రాష్ట్రంలోని స్వదేశీ పౌరుల ఆందోళనను, డిమాండ్‌ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

Updated Date - May 30 , 2025 | 02:59 PM