Golden Dome: అమెరికాకు గోల్డెన్ డోమ్.. భారత్ సుదర్శన్ చక్ర ఎంత పదిలం
ABN , Publish Date - May 21 , 2025 | 07:00 PM
అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలో గోల్డెన్ డోమ్‌ను ఏర్పాటు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు ఏకంగా 175 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలో గోల్డెన్ డోమ్ (Golden Dome)ను ఏర్పాటు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు ఏకంగా 175 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. మొదటి విడతగా 25 బిలియన్ డాలర్లను కేటాయించారు. ఈ నిర్మాణం కనుక పూర్తయితే ప్రపంచంలో ఏ దేశం నుంచి క్షిపణులను ప్రయోగించినా, చివరకు అంతరిక్షం నుంచి ప్రయోగించినా వాటిని సమర్థంగా అడ్డుకునే సామర్థ్యం ఈ గోల్డెన్ డోమ్‌కు ఉంటుంది.
ఇప్పటికే ఇజ్రాయేల్‌కు ఐరెన్ డోమ్ (Iron dome) పేరుతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం మిలిటరీ ఆపరేషన్స్‌లో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది అతి ముఖ్యంగా మారింది. శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ మిసైల్స్‌ను గుర్తించడం, ట్రాక్ చేయడం, నిర్వీర్యం చేయడం ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పని. వేల సంఖ్యలో వచ్చే మిసైల్స్, రాకెట్స్‌ను ఇజ్రాయేల్ ఐరన్ డోమ్ సమర్థంగా ఎదుర్కొని నిర్వీర్యం చేయగలదు. గతేడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో హమాస్, ఇరాన్ ప్రయోగించిన వేల మిసైల్స్ నుంచి ఇజ్రాయేల్‌ను ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాపాడింది.
ఇక, తాజాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనితీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. ఇంటెగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను ఉపయోగించి పాక్ క్షిపణుల్ని, డ్రోన్లను కూల్చివేసింది. క్షిపణుల్ని అడ్డుకోవడంలో భారత్ దేశీయంగా రూపొందించిన ఆకాశ్ క్షిపణులు, భారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందించిన బరాక్ 8 క్షిపణులు అత్యంత కీలకం. ఇక, రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ వ్యవస్థకు భారత్ సుదర్శన్ చక్ర (Sudarshan Chakra) అని పేరు పెట్టింది.
ఈ సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో వివిధ లేయర్ల వ్యవస్థలు ఉంటాయి. డ్రోన్ కంట్రోల్ సిగ్నల్స్‌ను పసిగట్టే సిగ్నల్ ఇంటెలిజన్స్ ఈ వ్యవస్థలో భాగం. డ్రోన్లు పనిచేయకుండా స్తంభింపజేయగల జామింగ్, స్పూఫింగ్ వ్యవస్థలు కూడా మన వద్ద ఉన్నాయి. వీటిని ఉపయోగించినా డ్రోన్ ముందుకు వస్తుంటే దానిని కూల్చివేయడానికి గన్స్, లేజర్ బేస్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక, క్షిపణులను అడ్డుకోవడంలో ఆకాశ్, భారత్-ఇజ్రాయెల్ బరాక్ 8, రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఎస్-400 సమర్థంగా పని చేస్తాయి.
ఇవి కూడా చదవండి
CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా
Vizianagaram Terror Suspects: ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు
Read Latest National News And Telugu News