Al Falah Founder Arrest: మనీలాండరింగ్ కేసులో అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడి అరెస్టు
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:20 PM
అల్ ఫలాహ్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్ధీఖీని ఈడీ తాజాగా అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలోని అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన పలువురు డాక్టర్లను ఉగ్రవాదం కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావెద్ అహ్మద్ సిద్దీఖీపై కూడా దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. తాజాగా సిద్దీఖీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఉగ్రవాద సంబంధిత నగదు అక్రమ రవాణా ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకుంది (Al Falah University Founder Arrested).
ఇప్పటికే ఢల్లీ క్రైమ్ బ్రాంచ్ విభాగం సిద్దీఖీపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. చీటింగ్, ఎక్రెడిషన్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేసింది.
తాజా ఉదంతంలో ఈడీ (Enforcement Directorate).. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో తనఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో పలు ఆధారాలు లభించాయని పేర్కొంది. ఢిల్లీలో అల్ ఫలాహ్ గ్రూప్‌కు సంబంధించి 19 చోట్ల ఈడీ తనిఖీలు నిర్వహించింది. గ్రూప్‌నకు చెందిన పలువురు కీలక వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. కోట్ల రూపాయల నిధులను ట్రస్టు సభ్యులు తమ బంధువులు, కుటుంబసభ్యుల పేరిట ఉన్న సంస్థల్లోకి మళ్లించినట్టు ఆధారాలు లభించాయని ఈడీ పేర్కొంది. కాటరింగ్ కాంట్రాక్టులు, నిర్మాణ పనులను జావేద్ అహ్మద్ తన భార్య, పిల్లల సంస్థలకు కేటాయించారని తెలిపింది. సోదాల్లో 48 లక్షల నగదు, పలు డిజిటల్ డివైజులు, ఇతర డాక్యుమెంట్‌లు లభించాయని ఈడీ వెల్లడించింది.
ఢిల్లీ ఎర్ర కోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు యూనివర్సిటీకి చెందిన పలువురు డాక్టర్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కారు బాంబు పేల్చిన సూసైడ్ బాంబర్ డా. ఉమర్ ఉన్ నబీకి కూడా యూనివర్సిటీతో సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. అంతకుముందే పోలీసులు ఓ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఫరీదాబాద్‌లో దాదాపు 2900 కిలోల బాంబు తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సూసైడ్ బాంబర్ డా. నబీ అప్రమత్తమై దాడికి తెగ బడి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి...
రాష్ట్రపతిని కలువనున్న మందకృష్ణ.. ఎందుకంటే
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవు
Read Latest National News And Telugu News