Air India Crash: విమాన ప్రమాదం.. శవాల అప్పగింతలో తప్పులు..
ABN , Publish Date - Jul 23 , 2025 | 02:55 PM
Air India Crash: డీఎన్ఏ పరీక్షలు చేయకుండానే దాదాపు 12 శవాలను ఎయిర్ ఇండియా యూకేకు పంపినట్లు సమాచారం. ఆ శవాల అప్పగింతలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. ప్రముఖ యూకే మీడియా దీనిపై ఓ కథనం ప్రచురించింది.

ఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమాన ప్రమాదంలో 271 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. విమానం కుప్పకూలిన వెంటనే పేలటంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో పడి అంతా కాలి బూడిద అయ్యారు. ఆ శవాలు ఎవరివో గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. శవాలను గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా శవాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే, యూకే జాతీయుల శవాల అప్పగింతలో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించలేదని తెలుస్తోంది.
డీఎన్ఏ పరీక్షలు చేయకుండానే దాదాపు 12 శవాలను ఎయిర్ ఇండియా యూకేకు పంపినట్లు సమాచారం. ఆ శవాల అప్పగింతలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. ప్రముఖ యూకే మీడియా డైలీ మెయిల్ కథనం ప్రకారం.. విమాన ప్రమాదంలో చనిపోయిన యూకే జాతీయుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా వేరే వ్యక్తుల శవాలు అప్పగించింది. వేరే వ్యక్తి శవం వచ్చిన కారణంగా ఓ కుటుంబం అంత్యక్రియల్ని ఆపేసింది. ఇంకో ఘటనలో ఒకే శవపేటికలో ఇద్దరి అవశేషాలు ఉన్నాయి.
దీనిపై ఇన్నర్ వెస్ట్ లండన్ కారోనర్ డాక్టర్ ఫియోనా విల్‌కాక్స్ మాట్లాడుతూ.. ప్రమాదంలో చనిపోయిన బ్రిటీష్ జాతీయుల శవాలను గుర్తించేందుకు వారి కుటుంబసభ్యులకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు. ఇక, శవాల అప్పగింతలో చోటుచేసుకున్న తప్పులపై లండన్‌లో ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూకే ప్రధాని ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో అల్లకల్లోలం..
ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఎవరికి లాభం?