AIIMS Patna Incident: అమానుషం.. చిన్న పిల్లల్ని తగలబెట్టిన దుండగులు..
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:45 PM
AIIMS Patna Incident: రోజూ లాగే ఆమె పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపింది. తను ఆస్పత్రికి వెళ్లిపోయింది. స్కూలు అయిపోయిన తర్వాత పిల్లలు నేరుగా ఇంటికి వచ్చారు. అయితే, గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు.

మనుషుల్లో మానవత్వం నశించిపోతోంది. కొంతమంది మంచి, చెడుల విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రాక్షసుల్లా మారిపోతున్నారు. చిన్న పిల్లలపైనా అమానుషాలకు పాల్పడుతున్నారు. తాజాగా, బిహార్‌లో అత్యంత క్రూరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. గుర్తుతెలియని కొందరు మృగాళ్లు ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపేశారు. ఇంట్లోనే వారిని తగలబెట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..
పట్నాకు చెందిన ఓ మహిళ ఏఐఐఎమ్ఎస్‌లో నర్సుగా పని చేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు అన్ష్, అంజలి ఉన్నారు. రోజూ లాగే ఆమె పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపింది. తను ఆస్పత్రికి వెళ్లిపోయింది. స్కూలు అయిపోయిన తర్వాత పిల్లలు నేరుగా ఇంటికి వచ్చారు. అయితే, గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. పిల్లలతో దారుణంగా ప్రవర్తించారు. వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోయారు.
ఇంట్లోంచి పిల్లల అరుపులు, మంటలు వస్తుండటంతో చుట్టుపక్కల ఇళ్లవారు ఇంటి దగ్గరకు వచ్చారు. మంటల్లో కాలిపోతున్న పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోయింది. తీవ్రగాయాల కారణంగా వారిద్దరూ చనిపోయారు. ఈ సమాచారం పిల్లల తల్లితోపాటు పోలీసులకు వెళ్లింది. తల్లి ఆస్పత్రి నుంచి పరుగులు పెట్టుకుంటూ ఇంటికి వచ్చింది. విగతజీవులుగా నేలపై పడున్న పిల్లల్ని చూస్తూ.. గుండెలు బద్దలయ్యేలా వెక్కివెక్కి ఏడ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితులు ఎవరు, పిల్లల్ని ఎందుకు హత్య చేశారనే విషయాలు ఇంకా తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
నోయల్‌కు ఇండియాలో చేదు అనుభవం.. లాక్కెళ్లిన పోలీసులు..
తల్లికి చివరి మెసేజ్.. అమ్మా నన్ను వీళ్లే చంపేస్తారు..