95 కోట్ల మందికి సంక్షేమం
ABN , Publish Date - Jun 30 , 2025 | 05:45 AM
కేంద్ర సామాజిక భద్రత పథకాలతో దేశంలో 95 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు. జనాభాలో 64 శాతం మందికి ఏదో ఒక రూపంలో సంక్షేమం...

దేశ జనాభాలో 64% మందికి సంక్షేమ పథకాలతో లబ్ధి.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సామాజిక భద్రత పథకాలతో దేశంలో 95 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు. జనాభాలో 64 శాతం మందికి ఏదో ఒక రూపంలో సంక్షేమం అందుతోందన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) తన నివేదికలో ఈ విషయం వెల్లడించిందన్నారు. ఆకాశవాణిలో ఆదివారం ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 123వ సంచికలో ఆయన ప్రసంగించారు. 2015కి ముందు వరకు దేశంలో 25 కోట్ల మంది మాత్రమే సామాజిక భద్రత కార్యక్రమాలతో ప్రయోజనం పొందారని చెప్పారు. ఇవాళ ఏదో ఒక పథకం ద్వారా 95 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఆరోగ్యం నుంచి సామాజిక భద్రత వరకు ప్రతి రంగంలో సంతుష్ట స్థాయికి చేరే దిశగా దేశం ముందుకెళ్తోందన్నారు. భారత్‌ను ట్రాకోమా(కంటివాపు) రహితదేశంగా ఐఎల్‌వో ప్రకటించడంపై ప్రధాని హర్షం వ్యక్తంచేశారు. దీని నిర్మూలనలో ‘స్వచ్ఛ భారత్ అభియాన్’, ‘జల్‌జీవన్ మిషన్’ కార్యక్రమాల సహకారం కూడా ఉందన్నారు. ఊబకాయాన్ని కూడా తగ్గించుకోవాలని పిలుపిచ్చారు. ఇందుకోసం నూనె వాడకాన్ని పది శాతం తగ్గించుకోవాలని పునరుద్ఘాటించారు. వివిధ యాత్రలకు బయల్దేరుతున్న భక్తులు, యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘సుదీర్ఘ కాలం తర్వాత సోమవారం నుంచి కైలాస్ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభమవుతోంది. అమరనాథ్ యాత్ర 3వ తేదీ నుంచి మొదలవుతోంది. ఇటీవలే పూరీ జగన్నాథుడి రథయాత్ర జరిగింది. కొద్ది రోజుల్లో పవిత్ర శ్రావణ మాసం వస్తోంది. ఉత్తరం నుంచి దక్షిణం.. తూర్పు నుంచి పశ్చిమం వరకు సాగే ఈ యాత్రలన్నీ ‘ఏక్ భారత్..శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి’ అని చెప్పారు.
విశాఖ యోగాంధ్రలో 3 లక్షలకుపైనే..
దేశవ్యాప్తంగానే గాక ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారని ప్రధాని గుర్తుచేశారు. ‘‘విశాఖ బీచ్‌లో నేను పాల్గొన్న యోగాంధ్ర కార్యక్రమంలో 3లక్షల మంది పాలుపంచుకున్నారు. ఇదోఅద్భుత దృశ్యం’’ అని పేర్కొన్నారు. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారని, సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో నిరూపించారని ప్రశంసించారు. మేఘాలయలో ‘ఎరి’ పట్టును ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీనికి కొద్ది రోజుల కిందట ‘జీఐ’ ట్యాగ్ కూడా లభించిందన్నారు. ‘ఎరి పట్టు మేఘాలయకు వారసత్వంలాంటిది. ఇక్కడి ఖాసీ తెగ ప్రజలు ఎన్నో తరాలుగా దీనిని సంరక్షిస్తూ వస్తున్నారు. ఈ పట్టును తీసుకోవడానికి పట్టుపురుగులను చంపవసరం లేదు. అందుకే దీనిని ‘అహింస పట్టు’గా పేర్కొంటున్నారు’ అని తెలిపారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని దేశం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుందని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజల క్రియాశీల భాగస్వామ్యం ఉంటే ఇలాంటి పెను సంక్షోభాలను ఎదుర్కోగలమన్నారు.
భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్..
తెలంగాణలోని భద్రాచలానికి చెందిన గిరిజన మహిళలను ప్రధాని ప్రశంసించారు. తమ జీవనోపాధి కోసం రోజంతా పొలాల్లో కూలీలుగా కష్టపడి పనిచేసే గిరిజన మహిళలు నేడు చిరుధాన్యాల (మిల్లెట్స్) నుంచి ఆరోగ్యకరమైన బిస్కెట్లు తయారు చేస్తున్నారని అన్నారు. ఈ బిస్కెట్లు ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’ పేరుతో హైదరాబాద్ నుంచి లండన్ దాకా వెళ్తున్నాయని తెలిపారు. ఆ గిరిజన మహిళలు ‘గిరి శానిటరీ ప్యాడ్లు’ తయారుచేశారని.. కేవలం మూడు నెలల్లో 40 వేల ప్యాడ్లను తయారుచేసి చాలా సరసమైన ధరకు పాఠశాలలు, సమీపంలోని కార్యాలయాలకు పంపిణీ చేశారని గుర్తుచేశారు.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News