తప్పుడు క్లెయిమ్‌లతో 1,070 కోట్లు లాగేశారు
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:59 AM
ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అటు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎ్‌సయూ), ఇటు ప్రైవేట్ సంస్థలకు చెందిన 90 వేల మంది వేతనజీవులు తప్పుడు క్లెయిమ్‌లు దాఖలు చేసి 2024 డిసెంబరు 31 నాటికి రూ.1,070 కోట్లు మినహాయింపులు

ఐటీ శాఖ పరిశీలనలో తేలిన లెక్క
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అటు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎ్‌సయూ), ఇటు ప్రైవేట్ సంస్థలకు చెందిన 90 వేల మంది వేతనజీవులు తప్పుడు క్లెయిమ్‌లు దాఖలు చేసి 2024 డిసెంబరు 31 నాటికి రూ.1,070 కోట్లు మినహాయింపులు పొందారని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ పరిశీలనలో తేలింది. ఐటీ శాఖ నిర్వహించిన సోదాలు, దాడులు, సర్వేల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. వారందరూ సమర్పించిన ఐటీఆర్‌లలో 80సీ, 80డీ, 80ఇ, 80 జీ, 80 జీజీబీ, 80 జీజీసీ సెక్షన్ల కింద తప్పుడు క్లెయిమ్‌లు చేయడం వల్ల ఆ మేరకు ప్రభుత్వాదాయానికి గండి పడింది. ప్రధానంగా 80 జీజీబీ/80 జీజీసీ సెక్షన్ల కింద పన్ను చెల్లింపుదారులు తీసుకున్న మినహాయింపు మొత్తానికి, దానం తీసుకున్న సంస్థలు దాఖలు చేసిన ఐటీఆర్‌లలో చూపిన మొత్తానికి మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు తేలింది.
అదే విధంగా 80సీ, 80ఇ, 80జీ కింద క్లెయిమ్ చేసుకున్న కొన్ని మినహాయింపులు సైతం అనుమానాస్పదంగా ఉన్నట్టు తేలిందని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. కొందరు అవాంఛనీయ శక్తులు వారిని తప్పుదారి పట్టించినట్టు కూడా పరిశీలనలో తేలినట్టు చెప్పారు. ఇలాంటి తప్పుడు క్లెయిమ్‌ల వల్ల ఏర్పడే పరిణామాలు, వాటిని దిద్దుకునే మార్గాలపై యాజమాన్యాల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఐటీ చట్టం 1961 కింద ఐటీఆర్‌ల దాఖలులో ఎలాంటి లోటుపాట్లున్నా అసెసీలు సంబంధిత అసె్‌సమెంట్ సంవత్సరం నుంచి రెండేళ్ల లోపు సవరించిన రిటర్న్ దాఖలు చేసుకునే వెసులుబాటు ఉంది.