Indians In Palestine Rescued: పాలస్తీనాలో భారతీయ కార్మికులను కాపాడిన ఇజ్రాయెల్ సైన్యం
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:02 PM
పాలస్తీనాలో బందీలుగా మారిన 10 మంది భారతీయ నిర్మాణ రంగం కార్మికులను ఇజ్రాయెల్ సైన్యం కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించింది.

ఇంటర్నెట్ డెస్క్: పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ దళాలు కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని అల్ జయీమ్ గ్రామంలో నిర్మాణ పనుల పేరిట వారిని ఉచ్చులోకి దింపి బందీలుగా మార్చారట. ఆ తరువాత వారి పాస్‌పోర్టులతో కొందరు పాలస్తీనా వారు ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ ఇజ్రాయెల్ దళాలకు చిక్కారు. అనుమానాస్పదంగా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తుండగా వారు అక్కడి దళాలకు చిక్కారు. దీంతో, భారతీయులు బందీలుగా ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది (10 Indian Workers Rescued By Israel).
ఆ తరువాత ఇజ్రాయెల్ పాప్యులేషన్, ఇమిగ్రేషన్ అథారిటీ అధికారులు, ఇజ్రాయెల్ సైన్యం, జస్టిస్ మినిస్ట్రీ సంయుక్తంగా రాత్రి వేళ.. పాలస్తీనాలో బందీలుగా మారిన భారతీయ కార్మికులను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం వారి వీసా చెల్లుబాటు వ్యవధి, ఉద్యోగానుమతి సంబంధిత విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని ఓ నిర్మాణ సంస్థలో పని చేసేందుకు తొలుత భారతీయ కార్మికులు వెళ్లారు. ఆ తరువాత పాలస్తీనాలో కూడా నిర్మాణం పనుల పేరిట వారిని బంధించినట్టు స్థానిక మీడియా పేర్కొంది.
ఘటనపై స్పందించిన స్థానిక ఇండియన్ ఎంబసీ.. ఈ విషయంపై విచారణ జరుగుతోందని పేర్కొంది. భారతీయుల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇజ్రాయెల్ దళాలకు విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించింది.
14 Year Old Forcibly Married: కర్ణాటకలో దారుణం.. 14 ఏళ్ల బాలికకు బలవంతంగా పెళ్లి చేసి ఆపై..
గతేదాది వేల మంది భారతీయ నిర్మాణ రంగ కార్మికులు ఇజ్రాయెల్ వెళ్లినట్టు తెలుస్తోంది. 2023 నాటి హమాస్ దాడి తరువాత పాలస్తీనా కార్మికులపై ఇజ్రాయెల్ నిషేధం విధించింది. దీంతో, నిర్మాణ రంగంలో కార్మికుల కొరత తీర్చేందుకు అనేక మంది భారతీయులు ఇజ్రాయెల్‌కు తరలివెళ్లారు. మీడియా కథనాల ప్రకారం, ఇజ్రాయెల్‌లో భారత సంతతికి చెందిన యూదులు సుమారు 85 వేల వరకూ ఉంటారు. దీనికి తోడు సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్నారు. వీరిలో అధిక శాతం మంది కేర్ గివర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, వజ్రాల వర్తకులని సమాచారం.