Share News

Infertility: నవయవ్వనంలోనే వంధ్యత్వం రాకూడదంటే.. ఈ అలవాట్లు మార్చుకోండి..

ABN , Publish Date - Jun 29 , 2025 | 08:09 AM

Infertility Reasons: ప్రపంచవ్యాప్తంగా నేటి యువతలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. ఉరకలేసే యవ్వనంలోనే ప్రజలు వంధ్యత్వంతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నా ప్రధాన కారణాలు మాత్రం ఈ అలవాట్లే అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.

Infertility: నవయవ్వనంలోనే వంధ్యత్వం రాకూడదంటే.. ఈ అలవాట్లు మార్చుకోండి..
Causes of Infertility in Young Adults

Impact of Inactive Lifestyle on Fertility: ఇప్పుడు వంధ్యత్వం అనేది వయసు మళ్లిన వారికే పరిమితమైన సమస్య కాదు. యుక్తవయసులో అడుగుపెట్టిన క్షణం నుంచే నేటితరం పునరుత్పత్తి సమస్యలతో సతమతమవుతున్నారు. 20-30 ఏళ్ల మధ్య వయసుగల యువతీయువకులు సంతానోత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితులు భావితరాల ఆరోగ్యానికి ముప్పు తెస్తాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలంతో పాటు క్షణం తీరికలేకుండా పరుగెడుతూ ఆహారం, ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్న వారిలోనే ఈ సమస్య మరింత పెరుగుతుండగా.. ఈ కింది అలవాట్లు ప్రధాన కారణాలని తాజా అధ్యయనాల్లో తేలింది.


రోజులో గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పర్యావరణ కాలుష్యం ఇలా అనేక రకాల కారణాలు వంధ్యత్వానికి దారితీస్తున్నాయి. ఇవేకాక నేటి కాలం యువతలో నిశ్చల జీవనశైలి పెరుగుతోంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేసే అలవాటు లేకపోవడం వల్ల పురుషులు, స్త్రీలు ఇద్దరిలో పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోంది. తాజా అధ్యయనాల ప్రకారం, ముఖ్యంగా భారతదేశంలో పట్టణాల్లోని యువతలో నిశ్చల జీవనశైలి బాగా పెరిగింది. గంటల తరబడి ఒకేచోట కూర్చునే ఉద్యోగాలు చేయడం, ఫోన్ లేదా టీవీలు చూసేందుకు ఎక్కువ సమయం వెచ్చించడం, ఆటలు, వ్యాయామాలకు దూరంగా ఉండటం వల్లే భారతీయ యువతలో వంధ్యత్వం పెరుగుతోంది. వీటిలో 5 ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం.


1. హార్మోన్ల అసమతుల్యత

శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత, బరువు సమస్యలు పెరుగుతాయి. తద్వారా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మహిళల్లో అండాశయ పనితీరునూ.. పురుషులలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో ఇప్పటికే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) తో బాధపడే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శారీరక శ్రమ లేకపోతే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. ఇక నిశ్చల జీవనశైలి పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను, నాణ్యతను తగ్గించి మొత్తం లైంగిక పనితీరును దెబ్బతీస్తుంది.

2. ఊబకాయం, జీవక్రియ లోపాలు

చెడు జీవనశైలి ఊబకాయానికి ప్రధాన కారణం. ఇది వంధ్యత్వానికి ప్రమాద కారకంగా వైద్యనిపుణులు పరిగణిస్తున్నారు. శరీరంలోని అధిక కొవ్వు లైంగిక హార్మోన్ల సమతుల్యతకు ఆటంకం కలిగిస్తుంది, లిబిడోను తగ్గిస్తుంది. అండం, స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇది గర్భధారణను మరింత కష్టతరం చేసే ఇతర జీవక్రియ అవాంతరాలను అభివృద్ధి చేయడమే కాకుండా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది.


3. ఆక్సీకరణ ఒత్తిడి

నిశ్చల జీవనశైలి వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. తద్వారా ఆక్సిడేటివ్ ఒత్తిడి అమాంతం పెరిగిపోతుంది. ఇది అండం, స్పెర్మ్ కణాల ఉత్పత్తిని, నాణ్యతను దెబ్బతీస్తుంది. అయితే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించుకుని పునరుత్పత్తికి అవసరమైన శక్తిసామర్థ్యాలను తిరిగి పొందవచ్చు.

4. మానసిక ఆరోగ్యం, ఒత్తిడి

వంధ్యత్వానికి, మానసిక ఆరోగ్యంతో సంబంధం లేదనుకుంటే అది చాలా పొరపాటు. నిశ్చల జీవనశైలికి అలవాటు పడినవారిలో నిరాశ, ఆందోళనలు వారికి తెలియకుండానే పెరిగిపోతుంటాయి. ఈ రెండు లక్షణాలు హార్మోన్ సైకిల్స్‌ను, లైంగిక పనితీరును దెబ్బతీస్తాయి. రోజువారీ శారీరక వ్యాయామం ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. మొత్తం మీద మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

5. డిజిటల్ జీవనశైలి

భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న డిజిటల్ జీవనశైలి జాతీయ ఆరోగ్య సమస్యగా మారింది. ముఖ్యంగా యువతతో సంతానోత్పత్తి గురించి చర్చించడాన్ని సమాజం ఇప్పటికీ అసభ్యంగా భావిస్తుండటం వల్ల చికిత్స, రోగ నిర్ధారణలో ఆలస్యం జరుగుతోంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం నుంచి వ్యాయామం చేయకుండా ఉండటం వరకూ అనుసరిస్తున్నజీవనశైలి నేటి యువత పునరుత్పత్తి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది.


నిశ్చల జీవనశైలిని వదిలించుకోవడానికి 5 మార్గాలు

  • యువత రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. అది నడక, యోగా, జిమ్ లేదా క్రీడలు ఏదైనా.

  • రోజంతా క్రమం తప్పకుండా నిద్రలేవడం. లేచిన వెంటనే స్ట్రెచింగ్ లేదా నడవడం వంటివి చేయండి. నిద్ర మేల్కొన్నాక ఎక్కువసేపు కూర్చోవడం మానుకోండి.

  • సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా బరువును అదుపులో పెట్టుకోండి.

  • స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. బాగా నిద్రపోండి.

  • మీకు సంతానోత్పత్తి సమస్యలు ఉన్నాయని అనుమానం కలిగితే ముందుగానే వైద్యుడి సలహా తీసుకోండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

ఇంట్లో అతి ఖర్చులు.. ఇలా కంట్రోల్ చేయండి..

ఈ రంగు చెప్పులు వేసుకుంటున్నారా.. జాగ్రత్త.. దురదృష్టం వెంటాడుతుంది..

For More Lifestyle News

Updated Date - Jun 29 , 2025 | 09:06 AM