Rashmika Mandanna: ప్రేమిస్తే... కచ్చితంగా మారతారు
ABN , Publish Date - Oct 19 , 2025 | 07:10 AM
రష్మిక మందన్న... ఈసారి రెండు విధాలుగా వార్తల్లోకి వచ్చింది. తెర వెనక... తన సన్నిహితుడు, సహనటుడైన విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ జరిగిందనేది ఒకటైతే... తెర ముందు... ఈసారి పంథా మార్చి ప్రేక్షకులను భయపెట్టేందుకు ‘థామా’తో సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె పంచుకొన్న కొన్ని ఆసక్తికర ముచ్చట్లివి...
రష్మిక మందన్న... ఈసారి రెండు విధాలుగా వార్తల్లోకి వచ్చింది. తెర వెనక... తన సన్నిహితుడు, సహనటుడైన విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ జరిగిందనేది ఒకటైతే... తెర ముందు... ఈసారి పంథా మార్చి ప్రేక్షకులను భయపెట్టేందుకు ‘థామా’తో సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె పంచుకొన్న కొన్ని ఆసక్తికర ముచ్చట్లివి...
మార్పు జరుగుతుంది...
మనం ఎవరినైనా ప్రేమించినా, లేక మనల్ని ఎవరైనా ప్రేమించినా... మార్పు కచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే భాగస్వామితో కలిసి ఉంటున్నప్పుడు, వారితో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు ఇద్దరి వ్యక్తిత్వాల్లో మార్పు వస్తుంది. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుంటారు. ఒకరి కోసం ఒకరు మారతారు. కాబట్టి ప్రాణ స్నేహితుడితో గానీ, భాగస్వామితో గానీ ప్రయాణించాక.. అకస్మాత్తుగా పాత రోజులను గుర్తుచేసుకుంటే... వారి కోసం మనం ఎంతలా మారామో అర్థమవుతుంది. ఆ మార్పునకు ఒక్కోసారి మనమే ఆశ్చర్యపోతాం.
ఆ ధైర్యం వల్లే...

చిన్నతనం నుంచి అన్నింటికీ భయపడుతూ, సిగ్గుపడుతూ ఉండే ప్రతీ ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే.. మీ మనసును సంతోషపెట్టేది మాత్రమే చేయండి. వాటినే అనుసరించండి. ధైర్యంగా లక్ష్యం దిశగా అడుగేయండి. ఎక్కడో కూర్గ్ లాంటి చిన్న పట్టణంలో పుట్టిన నేను... నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆ ధైర్యమే. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడమే జీవితం.
అద్దంలో మాట్లాడుకుంటా

అద్దం నా బెస్ట్ ఫ్రెండ్, నా థెరపిస్ట్ కూడా. పొద్దున్న లేవగానే.. నాతో నేను అద్దంలో కాసేపు మాట్లాడుకుంటా. ఒంటరిగా ఇంట్లో ఉన్నానంటే గట్టిగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తా. అంతేకాదు.. నేను మొక్కలతో కూడా మాట్లాడతా. మా గార్డెన్‌లోని మొక్కలకు ఎప్పుడైనా నీళ్లు పోయడం కాస్త ఆలస్యమైతే వాటికి సారీ కూడా చెప్తా. ప్రయాణాల్లో వీధి కుక్కలు కనిపిస్తే.. కారు పక్కకి ఆపి, వాటిని పలకరించి వెళ్తా.
పెర్‌ఫ్యూమ్స్‌పై ఇష్టంతో...

నాకు పెర్‌ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. వాటితో నాకు ఏదో తెలియని ఆత్మీయ బంధం ఉందనిపిస్తుంది. ఉదాహరణకు... వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన నన్ను నా బాల్యస్మృతుల్లోకి తీసుకెళ్తుంది. అలాగే కొన్ని సువాసనలు.. కూర్గ్‌లోని కాఫీ తోటల జ్ఞాపకాల్ని మనసులో మెదిలేలా చేస్తాయి. ఇలా నా జ్ఞాపకాల్ని నాకు పదే పదే గుర్తుకు తెచ్చే ఈ పరిమళాల్ని పెర్‌ఫ్యూమ్ బాటిల్‌లో ఎందుకు బంధించకూడదు? అని ఓసారి అనిపించింది. ఈ ప్రశ్నే ‘డియర్ డైరీ’ పేరుతో పరిమళాల బ్రాండ్‌ను ఇటీవల ప్రారంభించేలా చేసింది.
వారు ఎలాంటి వారంటే...

నేను ఇప్పటివరకు పనిచేసిన హీరోలందరూ చాలా స్వీట్. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే.. అమితాబ్ సర్.. వయసులో వ్యత్యాసం చూడకుండా అందరినీ ఒకేలా గౌరవిస్తారు. జీవితంలో ఏదైనా చేయగలననే నమ్మకాన్ని రణబీర్ ఇచ్చాడు. సల్మాన్‌ఖాన్ సెట్‌లో ఎప్పుడూ సరదాగా ఉంటాడు. జోక్స్ వేసి పక్కవాళ్లను నవ్విస్తుంటాడు. విక్కీకౌశల్ నుంచి యాక్టింగ్‌కు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. చీర ధరించి డ్యాన్స్ చేయడం, ఫైట్ చేయడం.. అల్లు అర్జున్ వల్లే సాధ్యమైంది. ఇలాంటి సాహసం వేరే ఏ హీరో చేయలేకపోవచ్చు. విజయ్ దేవరకొండ నాకెప్పుడూ సపోర్ట్ చేస్తుంటాడు.
పర్సనల్ ఛాయిస్
- నాకు నచ్చని అంశాల్లో ఒకటి... ధూమపానం. ఒకవేళ పాత్రకు అనుగుణంగా అలాంటి సన్నివేశాల్లో నటించమని కోరితే, ఆ సినిమా వదులుకోవడానికి కూడా వెనుకాడను.
- ఎదుటి వ్యక్తిలో నన్ను ఆకర్షించే అంశం అంటే కళ్లు. కళ్లు మనసుకు ప్రతిబింబాలు. కళ్లతో పలికించే హావభావాలను నమ్ముతాను. నవ్వుతూ ఉండే వ్యక్తులను ఇష్టపడతాను.
- ఓరోజు అభిమాని ఎవరో మా ఇంటికి ఒక బహుమతి పంపారు. అందులో రక్తంతో రాసిన ప్రేమలేఖ ఉంది. దాన్ని చూసి భయపడ్డా.
- కథ బాగుంటే నలుగురు పిల్లల తల్లిగానైనా నటిస్తా. బామ్మ పాత్ర చేయడానికి కూడా వెనుకాడను.
- నాకు సంతోషకరమైన ప్రదేశం మా ఇల్లే. ఇంట్లో ఉంటే ఎంతో ఆనందంగా, పాజిటివ్‌గా అనిపిస్తుంది.
- ఏకథాటిగా షూటింగ్ జరుగుతూ ఉంటే సెట్‌లో అందరికీ బోర్ అనిపిస్తుంది. అలాంటప్పుడు నేను సరదాగా స్టెప్స్ వేస్తా. లేదంటే కామెడీ ఎక్స్‌ప్రెషన్స్ పెడుతూ అందరినీ నవ్విస్తా.
- వింత జంతువుల శబ్దాలను బాగా మిమిక్రీ చేయగలను.