వర్షాకాలంలో వీటి గురించి తెలుసుకోండి.. నిశ్చింతంగా జీవించండి..
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:25 AM
వానాకాలం ఇళ్లకే పరిమితం కాకుండా... వర్షంలో తడుస్తూ కొండలు, కోనలు... పచ్చని చెట్లను చూస్తూ... ప్రకృతిని ఆస్వాదించేవారు చాలామందే ఉంటారు. వర్షాల్లో పర్యాటకం కచ్చితంగా సరికొత్త అనుభూతినిస్తుంది. అయితే ఈ కాలంలో సాఫీగా ప్రయాణం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. నిపుణులు ఏం చెబుతున్నారంటే...

- వానల్లో... సాఫీగా...
వానాకాలం ఇళ్లకే పరిమితం కాకుండా... వర్షంలో తడుస్తూ కొండలు, కోనలు... పచ్చని చెట్లను చూస్తూ... ప్రకృతిని ఆస్వాదించేవారు చాలామందే ఉంటారు. వర్షాల్లో పర్యాటకం కచ్చితంగా సరికొత్త అనుభూతినిస్తుంది. అయితే ఈ కాలంలో సాఫీగా ప్రయాణం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. నిపుణులు ఏం చెబుతున్నారంటే...
వాతావరణ యాప్‌లు
ఏ ప్రాంతానికి వెళ్లాలనుకున్నా... ముందుగా అక్కడి వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకోవడం ముఖ్యం. అందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో మౌసమ్, అక్యూవెదర్ లేదా విండీ వంటి విశ్వసనీయ వాతావరణ యాప్‌లు పనికొస్తాయి. ఇవి వర్షపాతం, కొండచరియలు విరిగిపడడం... ఇలా వాతావరణానికి సంబంధించిన ప్రతీది ముందుగానే తెలియజేసి అప్రమత్తం చేస్తాయి. అలాగే ఈ కాలంలో జారుడు రోడ్లు, నీటి గుంతల కారణంగా రాత్రిపూట ప్రయాణాలు పెట్టుకోవద్దు.
ఇవి ఉండాల్సిందే...
అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే ఫోన్ ఛార్జర్, పవర్ బ్యాంక్ వంటివి వెంట ఉంచుకోవాలి. కొందరు వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి సమస్యలకు సంబంధించిన మందులు, ఎమర్జెన్సీ కిట్‌ను తీసుకెళ్లడం మరవొద్దు.
బుక్ చేసే ముందు...
వాతావరణ పరిస్థితుల కారణంగా రైళ్లు, విమానాలు ఆలస్యం కావడం లేదా ఒక్కోసారి రద్దు అవ్వడం జరుగుతుంటాయి. కాబట్టి ఫ్లెక్సిబుల్ క్యాన్సిలేషన్, రీ షెడ్యూలింగ్ ఆప్షన్స్ ఉన్న హోమ్‌స్టేలు లేదా హోటళ్లను ఎంపిక చేసుకోవాలి. అలాగే వాటిని బుక్ చేసుకునే ముందు బ్యాకప్ జనరేటర్, 24 గంటలు వేడినీరు, ఇండోర్ యాక్టివిటీస్ వంటివి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి.
గ్యాడ్జెట్స్ కోసం..
ఫోన్, ల్యాప్‌టాప్, కెమెరా వంటి ఎలకా్ట్రనిక్ వస్తువులు వెంట తీసుకువెళ్తే... అవి తడవకుండా వాటర్‌ప్రూఫ్ కవర్లు, బ్యాగ్‌లు ఉంచుకోవాలి. ముఖ్యమైన పత్రాలు, డబ్బును జిప్-లాక్ బ్యాగ్ లేదా వాటర్‌ప్రూఫ్ బ్యాక్ ప్యాక్ కవర్‌లో భద్రపరచాలి.
దుస్తుల విషయంలో...
వర్షాకాలంలో తేమ వాతావరణం ఉంటుంది. కాబట్టి దుస్తుల ఎంపిక విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తొందరగా ఆరిపోయే దుస్తులను ఎంచుకోవాలి. గొడుగు, రెయిన్‌కోట్, వాటర్‌ప్రూఫ్ జాకెట్.. తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అలాగే పాదరక్షల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలి. హైహీల్స్ కాకుండా... వాటర్ ప్రూ్‌ఫ్, గ్రిప్ ఉండే షూ వాడటం మంచిది. ఫ్లిప్-ఫ్లాప్స్‌ను దూరం పెట్టడమే బెటర్.
మరికొన్ని జాగ్రత్తలు...
- ఈ కాలంలో చిరుతిండ్లు, రోడ్ల పక్కన దొరికే జంక్‌ఫుడ్ తీసుకోకపోవడం ఉత్తమం. వేడి, తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
- కొండలు లేదా మారుమూల ప్రాంతాల్లో తరచూ నెట్‌వర్క్ సమస్యలు వస్తాయి. దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలి. డిజిటల్ పేమెంట్స్‌పైనే ఆధారపడకుండా కొంత డబ్బు వెంట ఉంచుకోవాలి.
- ప్రయాణానికి ముందు మీ వాహనం బ్రేక్‌లు, వైపర్లు, టైర్ల కండీషన్‌ని చెక్ చేయాలి. స్పేర్ టైర్ తప్పనిసరి. ఇంధనాన్ని తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి.
- ఈ కాలంలో నీరు, దోమల ద్వారా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి ఫిల్టర్ నీళ్లు తాగాలి. మస్కిటో రెపిలెంట్స్ వెంట ఉంచుకోవాలి. సాయంత్రం, రాత్రి వేళ్లలో లాంగ్ స్లీవ్స్ ఉన్న దుస్తులు ధరించాలి.
- వాతావరణ సంబంధిత సమస్యలను కవర్ చేసే ప్రయాణ బీమా తీసుకోవాలి. వైద్య ఖర్చులు, రైలు లేదా విమానం ఆలస్యం కావడం లేదా రద్దు, సామాను నష్టం వంటివి జరిగినప్పుడు మీకు సహాయపడుతుంది.
- రుతుపవనాలు ఎక్కువగా ఉండే, ఆకస్మిక వరదలకు గురయ్యే ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది.
- వర్షాకాలం అంటే సాధారణంగా పర్యటనలకు, ట్రావెలింగ్‌కు అంత అనువైన సమయం కాదని భావిస్తుంటారు. కానీ నేటితరం మాత్రం వీటన్నింటిని పక్కనపెడుతూ వర్షాకాల పర్యటనల వైపు మొగ్గు చూపుతోంది. వర్షాకాల సీజన్ బుకింగ్స్‌లో ఈ ఏడాది 46 శాతం పెరుగుదల కనిపించిందని ‘క్లియర్ ట్రిప్’ పేర్కొంది.
- గతేడాది వర్షాకాలంతో పోలిస్తే ప్రస్తుతం ఫ్లైట్ బుకింగ్‌లు 25-30 శాతం పెరిగాయని... పోర్ట్‌బ్లెయిర్, తిరుపతి, ఉదయ్‌పూర్, కోయంబత్తూర్, డెహ్రాడూన్ వంటి ప్రదేశాలకు డిమాండ్ బాగా ఉందంటోంది ఇక్సిగో గ్రూప్.