Brics: బ్రిక్స్ దేశాల ఒకే కరెన్సీ.. భారత్‌కు తెచ్చే బెన్ఫిట్సేంటి?
ABN , Publish Date - Jul 08 , 2025 | 08:52 PM
బ్రెజిల్, రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్ సరికొత్త ఆలోచనలతో ముగిసింది. ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో హైలెట్ ఏంటంటే, ఒకే కరెన్సీ. ఇది ప్రధానంగా ప్రపంచ ఇంటర్‌బ్యాంక్ చెల్లింపు నెట్‌వర్క్ అయిన SWIFTకి ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టిస్తుంది.

ఇంటర్నెట్ డెస్క్: బ్రెజిల్‌లో తాజాగా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో సభ్యదేశాల నేతలు ఒకే కరెన్సీ (చెల్లింపుల వ్యవస్థ)కు సంబంధించి మరో అడుగు ముందుకేశారు. సభ్య దేశాల వర్తక, వాణిజ్యాలకు ఒకే కరెన్సీ ఉండాలనే తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. 2015 లోనే ఈ ఐక్య కరెన్సీకి సంబంధించి మొదటగా ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ, బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, వేగంగా, సురక్షితంగా చెల్లింపులు చేయడానికి లక్ష్యంగా ఈ ఆలోచన చేశారు. మరోవైపు, ప్రపంచ వాణిజ్యంలో అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ఇది ఒక మార్గంగా కూడా చెబుతున్నారు. అయితే, ఈ ప్రతిపాదనపై పురోగతి మాత్రం నెమ్మదిగా ఉంది.
కాగా, బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్ సరికొత్త ఆలోచనలతో ముగిసిందనే చెప్పాలి. ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో హైలెట్ ఏంటంటే, ఒకే కరెన్సీ. బ్రిక్స్ దేశాల నాయకులు ఈ వ్యవస్థను అమలు చేయడంపై ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఇది ప్రధానంగా ప్రపంచ ఇంటర్‌బ్యాంక్ చెల్లింపు నెట్‌వర్క్ అయిన SWIFTకి ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టిస్తుంది.
ఈ తాజా పరిణామం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి టారిఫ్ సుంకాల బెదిరింపుల నుంచే రాజుకున్నట్టు కనిపిస్తోంది. నాయకుల సామూహిక ప్రకటనలో, 'బ్రిక్స్ క్రాస్-బోర్డర్ చెల్లింపుల చొరవపై చర్చను కొనసాగించడానికి, బ్రిక్స్ చెల్లింపుల టాస్క్ ఫోర్స్ సాధ్యమైన మార్గాలను గుర్తించడంలో సాధించిన పురోగతిని మేము సముచితంగా గుర్తించాం' అని ఉంది.
కాగా, భారత్ ఇప్పటికే యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా లావాదేవీలు చేసుకునేందుకు అనేక దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక, బ్రిక్స్ దేశాలు ఒకే కరెన్సీ వాడడం వల్ల ప్రయోజనాల విషయానికొస్తే, ఇది విదేశీ వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కరెన్సీ మార్పిడి రేటు అనే పెద్ద సమస్య తొలగిపోవడం వల్ల వాణిజ్య వ్యయాలు తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా, చిన్న, మధ్య తరహా సంస్థలు కొత్త మార్కెట్లు కనుగొని తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.
డాలర్‌పై ఆధారపడ్డాన్ని తగ్గించడం. బ్రిక్స్ ఒకే కరెన్సీ ద్వారా, డాలర్ వినియోగాన్ని తగ్గించి, భారతదేశ విదేశీ మారక నిల్వలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే వీలుంటుంది. ఇది భారతదేశానికి బ్రిక్స్ దేశాల్లో ప్రధాన పాత్రను కల్పిస్తుంది. ఈ పరిణామం ఆర్థిక సమన్వయానికి బలాన్నిస్తుంది.
అయితే, బ్రిక్స్ ఒకే కరెన్సీ భారతదేశానికి కొన్ని ప్రధాన సవాళ్లను కూడా తెచ్చే అవకాశం ఉంది. భారత రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పరపతి విధానాన్ని ప్రత్యేక ఆర్థిక అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తుంది. బ్రిక్స్ ఒకే కరెన్సీ స్వీకరించడంతో భారతదేశం ఆ విధానానికి మారాల్సి రావడం వల్ల, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిక లక్ష్యాల సాధనలో కొంతమేర సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు.
అంతేకాదు, భారతదేశ ఆర్థిక వైవిధ్యం బ్రిక్స్ దేశాల మధ్య ఉన్న అసమానతలకు కారణం కావచ్చు. చెప్పాలంటే, చైనా ఆర్థిక వ్యవస్థ భారతదేశానికి అయిదు రెట్లు ఎక్కువ. ఈ తేడాలు బ్రిక్స్ ఒకే కరెన్సీ స్థిరత్వానికి కొంత ఇబ్బందికరంగా మారొచ్చు. యూరో జోన్ సంక్షోభ పాఠాలు బ్రిక్స్ ఒకే కరెన్సీ విషయంలో అప్రమత్తత అవసరమని సూచిస్తాయి. దీంతోపాటు చైనాతో సరిహద్దు వివాదాలు, రష్యాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
ప్రియుడి మోజులో వివాహిత దారుణం.. మంచానపడ్డ భర్తను కిరాతకంగా హత్య
ఢిల్లీలో సీరియల్ కిల్లర్ అరెస్టు.. 24 ఏళ్ల తరువాత పట్టుకున్న పోలీసులు