Share News

US Criminal Court: మాపైనే దర్యాప్తునకు ఆదేశిస్తారా?

ABN , Publish Date - Jun 07 , 2025 | 05:32 AM

కోర్టు ఇచ్చిన తీర్పుల్ని మనకు నచ్చినా, నచ్చకున్నా పాటిస్తాం. పాటించాలి. కానీ.. అమెరికాకి అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ)లో నచ్చని తీర్పు వస్తే ఏం చేసిందో తెలుసా

US Criminal Court: మాపైనే దర్యాప్తునకు ఆదేశిస్తారా?

  • అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుపై అమెరికా ఆగ్రహం

  • నలుగురు జడ్జిలపై ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటన

వాషింగ్టన్‌, జూన్‌ 6: కోర్టు ఇచ్చిన తీర్పుల్ని మనకు నచ్చినా, నచ్చకున్నా పాటిస్తాం. పాటించాలి. కానీ.. అమెరికాకి అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ)లో నచ్చని తీర్పు వస్తే ఏం చేసిందో తెలుసా? ఆ కోర్టులోని న్యాయమూర్తులపైనే ఆంక్షలు విధించింది! గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను యుద్ధనేరంగా పరిగణిస్తూ.. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో అమెరికాకు కోపం వచ్చింది. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు రాజకీయ వేదికగా మారిందని, ప్రత్యేకించి ఈ నలుగురు న్యాయమూర్తులూ చట్టవిరుద్ధంగా, ఆధారాలేవీ లేకుండా.. అమెరికాను, తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకున్నారని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనిన్‌, పెరూ, స్లొవేనియా, ఉగాండాకు చెందిన ఆ నలుగురు న్యాయమూర్తులకు చెందిన ఆస్తులు అమెరికా పరిధిలో ఉంటే వాటన్నింటిని స్తంభింపజేస్తామని ప్రకటించారు. ట్రంప్‌ మొదటిసారి అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు కూడా ఇలాగే అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుపై ఆంక్షలు విధిస్తే.. 2021లో బైడెన్‌ సర్కారు వాటిని తొలగించింది.


హార్వర్డ్‌పై ట్రంప్‌ నిర్ణయానికి ఫెడరల్‌ కోర్టు బ్రేక్‌

వాషింగ్టన్‌, జూన్‌ 6: హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకునేందుకు వచ్చే విదేశీ విద్యార్థులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫెడరల్‌ కోర్టులో చుక్కెదురైంది. ఆయన విధించిన ఆంక్షలను ఫెడరల్‌ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఫెడరల్‌ కోర్టును హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆశ్రయించింది. వైట్‌హౌస్‌ డిమాండ్లను హార్వర్డ్‌ వర్సిటీ తిరస్కరించిన నేపథ్యంలో ట్రంప్‌ నిర్ణయం చట్టవిరుద్ధమైన ప్రతీకార చర్యగా అభివర్ణించింది.

Updated Date - Jun 07 , 2025 | 05:32 AM