US Immigration: యూదు వ్యతిరేక పోస్టులు పెడితే.. వీసా రద్దు!
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:37 AM
యూఎస్ పౌరసత్వ, వలసల విభాగం (యూఎస్‌సీఐఎస్) యూదు వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి వీసా ఇవ్వకుండా, శాశ్వత నివాస అనుమతులు రద్దు చేయాలని హెచ్చరించింది. ఇదే సమయంలో, వీసా దరఖాస్తుదారుల కోసం డీఎస్-160 ఫారం సమర్పణ తప్పనిసరిగా చేయాలని నిర్ణయించింది.

శాశ్వత నివాసానికి అనుమతులూ నిరాకరిస్తాం.. యూఎస్‌సీఐఎస్ ప్రకటన
విద్యార్థి వీసా, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు హెచ్చరికలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి వీసాలు మంజూరు చేయబోమని అమెరికా స్పష్టం చేసింది. ఈ నిబంధన తక్షణమే అమలులోకి వస్తుందని అమెరికా పౌరసత్వ, వలసల విభాగం (యూఎస్‌సీఐఎస్ ) అధికారికంగా ప్రకటించింది. విద్యార్థి వీసాతోపాటు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొనేవారి సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడతామని, యూదు వ్యతిరేక కంటెంట్ పోస్టు చేసేవారికి వీసా నిరాకరిస్తామని ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్నవారు ఇటువంటి చర్యలకు పాల్పడితే వారి శాశ్వత నివాస అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. హమాస్, లెబనాన్ హెజ్‌బొల్లా, యెనెన్ హూతీ తిరుగుబాటుదారులతో సహా ఉగ్రసంస్థలుగా అమెరికా వర్గీకరించిన మిలిటెంట్ గ్రూపులకు మద్దతుగా పోస్టులు పెట్టడాన్ని యూదు వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తామని యూఎ్‌ససీఐఎస్ తేల్చిచెప్పింది. యూదు వ్యతిరేక ఉగ్రవాదాన్ని, ఆ తీవ్రవాద సంస్థల కార్యకలాపాలను సమర్థించడం, ప్రోత్సహించడం, వాటికి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ప్రతికూల అంశాలుగా పరిగణిస్తామని, దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. గత కొన్ని వారాలుగా ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోని వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది.
డీఎస్-160 ఫాం సమర్పిస్తేనే వీసా ఇంటర్వ్యూ
అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసేవారు ఇకపై ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకోవడానికి ముందే డీఎస్-160 ఫాం తప్పనిసరిగా సమర్పించాలి. ఈమేరకు ఆన్‌లైన్ ఫాం, షెడ్యూల్ ప్రక్రియలో అమెరికా విదేశాంగ శాఖ మార్పులు చేసింది. గతంలో దరఖాస్తుదారులు ఫాం సమర్పించడానికి ముందే స్లాట్ బుక్ చేసుకొనే అవకాశం ఉండేది. ఇది కొన్నిసార్లు దరఖాస్తు ప్రాసెసింగ్‌లో జాప్యానికి కారణమవుతోంది. దీంతో తాజా నిర్ణయంతీసుకున్నారు.
అణు కార్యక్రమం విరమించుకోకుంటే
సైనిక చర్య : ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అణ్వస్త్రాలను సమకూర్చుకోవాలనే ఆలోచనను విరమించుకోకపోతే సైనిక చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. సైనిక చర్యలో ఇజ్రాయెల్ కూడా పాల్గొంటుందన్నారు. శనివారం ఒమన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రత్యక్ష చర్చలకు ఒప్పుకోబోమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇప్పటికే తేల్చి చెప్పగా, జరగాల్సిందేనని ట్రంప్ పట్టుబడుతున్నారు.