SBI Report: ట్రంప్ సుంకాలతో అమెరికా కుటుంబాలపై దెబ్బ
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:46 AM
అమెరికా అధ్యక్షుడ్డు ట్రంప్ తమ దేశంలోకి వచ్చే వివిధ దేశాల ఉత్పత్తులపై కొత్తగా విధించిన సుంకాలు అమెరికన్ కుటుంబాలను గణనీయం

సగటున 2,400 డాలర్ల వ్యయం పెరగొచ్చు.. ఎస్బీఐ రిపోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 1: అమెరికా అధ్యక్షుడ్డు ట్రంప్ తమ దేశంలోకి వచ్చే వివిధ దేశాల ఉత్పత్తులపై కొత్తగా విధించిన సుంకాలు అమెరికన్ కుటుంబాలను గణనీయంగా ప్రభావితం చేయవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. సుంకాల దెబ్బతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఫలితంగా స్వల్పకాలంలో అమెరికన్ కుటుంబాల సగటు వ్యయాలు దాదాపు 2,400 డాలర్లు (దాదాపు రూ.2.09లక్షలు) పెరిగే అవకాశం ఉందని ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక పేర్కొంది. పెరిగిన కుటుంబాల వ్యయాల భారం అన్ని కుటుంబాలకు ఒకే విధంగా ఉండదని, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు దాదాపు 1,300 డాలర్ల నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ భారం సంపన్న కుటుంబాలతో పోల్చితే దాదాపు మూడు రెట్లు ఎక్కువని తెలిపింది. మరోవైపు అధిక ఆదాయ కుటుంబాలు 5,000 డాలర్ల వరకు నష్టాన్ని ఎదుర్కొవచ్చని అంచనా వేసింది. కొత్త సుంకాలతో భారత్‌కన్నా అమెరికా ఆర్థిక వ్యవస్థనే ఎక్కువగా దెబ్బతీయవచ్చని పేర్కొంది. తక్కువ జీడీపీ వృద్ధి అంచనా, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తోడు కొత్త సుంకాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత నష్టపోతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇక అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, కొత్త సుంకాల ప్రభావంతో ద్రవ్యోల్బణం అమెరికా ఫెడరల్ రిజర్వు 2026 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 2 శాతం కన్నా ఎగువన ఉండవచ్చని నివేదిక పేర్కొంది. సుంకాల సంబంధిత ఒత్తిళ్ల ఫలితంగా అమెరికా జీడీపీపై దాదాపు 40 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర దెబ్బ పడవచ్చని తెలిపింది. ఇక భారత్‌పై ఆర్థిక ప్రభావం తక్కువగా ఉండనుందని ఎస్బీఐ అంచనా వేసింది.