India on Trump Comments: అలాంటిదేమీ లేదు.. ట్రంప్ వ్యాఖ్యలపై భారత వర్గాల స్పందన
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:55 PM
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తే అది మంచి నిర్ణయమే అవుతుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై భారత వర్గాలు మరోసారి స్పందించాయి. భారత ఇంధన కంపెనీలు రష్యా దిగుమతులను ఆపేసినట్టు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశాయి. జాతి ప్రయోజనాలను బట్టే తమ నిర్ణయాలు ఉంటాయని తెలిపాయి.

ఇంటర్నెట్ డెస్క్: భారత ఇంధన కంపెనీలు రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేశాయన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..అది మంచి నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌పై భారత వర్గాలు స్పందించాయి. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్టు తమ దృష్టికి రాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో భారత నిర్ణయాలన్నీ మార్కెట్ పరిస్థితులు, జాతి ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయని మరోసారి స్పష్టం చేశాయి.
‘ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏమిటో నిన్ననే స్పష్టంగా పేర్కొన్నాము. ఇంధన కొనుగోళ్లు అన్నీ మార్కెట్ పరిస్థితులు, జాతి ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయి. భారత ఆయిల్ కంపెనీలు రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేసినట్టు మా దృష్టికి ఎలాంటి సమాచారం రాలేదు’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
సముద్ర మార్గంలో రష్యా చమురును దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. అయితే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియమ్, భారత్ పెట్రోలియమ్, మంగళూరు ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ సంస్థలు గత వారం రోజులుగా రష్యా దిగుమతులను నిలిపివేశాయంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్‌కు దీర్ఘకాలిక దౌత్యసంబంధాలు ఉన్నాయని అన్నారు. అమెరికా-భారత్ దౌత్య సంబంధం కాల పరీక్షకు నిలిచినదని కామెంట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉన్నా భవిష్యత్తులో అంతా సర్దుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వాణిజ్య లోటు పూడ్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. రష్యా చమురు కొనుగోలు చేస్తే అదనపు పెనాల్టీలు కూడా విధిస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి:
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ వార్తలు.. ట్రంప్ రెస్పాన్స్ ఇదీ
టెస్లా ఆటో పైలట్ వైఫల్యం.. 242 మిలియన్ డాలర్‌ల పరిహారం చెల్లించాలంటూ తీర్పు
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి