Share News

US Trade Policy: మనపై 25శాతం.. పాక్‌పై 19శాతం

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:38 AM

సుంకాల రంకెలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. తమతో ఇంకా ఒప్పందం కుదుర్చుకోని 69 దేశాలపై

US Trade Policy: మనపై 25శాతం.. పాక్‌పై 19శాతం

  • తమతో ఒప్పందం కుదుర్చుకోని 69 దేశాలపై సుంకాల భారం.. ఉత్తర్వుపై ట్రంప్‌ సంతకం

న్యూయార్క్‌/వాషింగ్టన్‌, ఆగస్టు 1: సుంకాల రంకెలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. తమతో ఇంకా ఒప్పందం కుదుర్చుకోని 69 దేశాలపై టారి్‌ఫల భారాన్ని ఖరారు చేశారు. భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకాల భారం మోపిన ఆయన.. పాకిస్థాన్‌ ఉత్పత్తులపై 19 శాతమే విధిస్తున్నట్టు వెల్లడించారు. ఈమేరకు.. ‘ఫర్దర్‌ మాడిఫయింగ్‌ ద రెసిప్రోకల్‌ టారిఫ్స్‌’ పేరిట రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్‌ సంతకం చేశారు. తమతో ఇప్పటికే చాలా దేశాలు అర్థవంతమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని.. మరికొన్ని దేశాలు కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాయని అందులో తెలిపారు. ‘‘మిగతా దేశాలు చర్చలు జరుపుతున్నప్పటికీ.. అమెరికాతో ఉన్న వాణిజ్య అసమతౌల్యాలను పరిష్కరించే దిశగా సరైన ప్రతిపాదనలు చేయట్లేదని నాకు అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. అలాంటి దేశాలపై సుంకాలు విధిస్తున్నట్టు తెలిపారు. ట్రంప్‌ పేర్కొన్న అలాంటి దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది. ఈసారి లావోస్‌, మయన్మార్‌ దేశాలపై అత్యధికంగా 40ు సుంకం, స్విస్‌ ఎగుమతులపై 39ు, కెనడాపై 35ు విధించిన ట్రంప్‌.. జపాన్‌పై 15ు, పాకిస్థాన్‌, థాయ్‌ల్యాండ్‌, మలేసియా దేశాలపై 19ు, శ్రీలంకపై 20 శాతం సుంకాలు విధించారు. కెనడాపై సుంకాల బాదుడు శుక్రవారం నుంచే (ఆగస్టు 1) అమల్లోకి రాగా.. మిగతా దేశాలపై 7వ తేదీ నుంచి అమలవుతుందని తెలిపారు. రష్యా నుంచి చమురుకొంటున్నందుకు భారత్‌పై అదనంగా జరిమానా కూడా వేస్తామన్న ఆయన.. కార్యనిర్వాహక ఉత్తర్వులో మాత్రం ఆ ప్రస్తావనే తేకపోవడం గమనార్హం. కాగా.. ఇప్పటికే అమెరికాకు ఎగుమతి అయ్యి, దారిలో ఉన్న ఉత్పత్తులపై, లోడింగ్‌ పూర్తయి ఆగస్టు 7లోగా బయల్దేరడానికి నౌకల్లో సిద్ధంగా ఉన్న ఉత్పత్తులపై.. కొత్త సుంకం వర్తించదని ‘భారత ఎగుమతి సంఘాల సమాఖ్య’ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ తెలిపారు. ట్రంప్‌ సుంకాల భారం నేపథ్యంలో.. దేశ ప్రయోజనాలను కాపాడడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం పేర్కొంది. అమెరికాతో వాణిజ్య చర్చల్లో వ్యవసాయ, పాల ఉత్పత్తుల రంగ ప్రయోజనాలను పరిరక్షిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ‘‘మన ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి.. మార్కెట్లో అందుబాటులో ఉన్నదానిని బట్టి, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. తద్వారా.. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ఆపబోమని ఆయన చెప్పకనే చెప్పారు.

Updated Date - Aug 02 , 2025 | 05:38 AM