ట్రంప్‌పై మండిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు
ABN , Publish Date - Jul 10 , 2025 | 08:41 AM
తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు సహించబోమని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా స్పష్టం చేశారు. బ్రెజిల్ ఉత్పత్తులపై 50 శాతం సుంకాన్ని ప్రకటించిన ట్రంప్‌పై ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రతీకార సుంకాలు తప్పవని హెచ్చరించారు.

ఇంటర్నెట్ డెస్క్: డొనాల్డ్ ట్రంప్ తమ ఉత్పత్తులపై 50 శాతం సుంకం విధించడాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా ఖండించారు. ట్రంప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో కేసు విచారణలో అన్యాయం జరుగుతోందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. సుంకాల పెంపునకు ఇదీ ఒక కారణమని ఆయన తెలిపారు. దీంతో, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి.
ట్రంప్ చర్యలపై బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘బ్రెజిల్ ఒక సార్వభౌమ దేశం. ఇక్కడి వ్యవస్థలు స్వతంత్ర ప్రతిపత్తితో పని చేస్తాయి. విదేశీ ఆధిపత్యాన్ని మేము అస్సలు సహించబోము. ఏకపక్షంగా సుంకాలు విధిస్తే ఇందుకు ప్రతి చర్యలు తప్పవు. చట్టాలను అనుసరించి ప్రతీకార సుంకాలను విధిస్తాం’ అని లూలా డా సిల్వా హెచ్చరించారు.
2022 నాటి ఎన్నికల్లో ఓటమి తరువాత కుట్ర పూరితంగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు బోల్సోనారోపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ అంశంపైనా అధ్యక్షుడు లూలా డా సిల్వా స్పందించారు. ‘ఈ కేసుకు సంబంధించి విచారణ బ్రెజిల్ పరిధికి చెందినది. ఈ విషయంలో జాతీయ వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే ఎలాంటి జోక్యానికి తావు లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
2022 నాటి ఎన్నికల్లో లూలా డా సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, సంప్రదాయిక వాది అయిన బోల్సోనారోకు ట్రంప్ మొదటి నుంచి మద్దతుగా ఉన్నారు. బోల్సోనారోపై విచారణకు వ్యతిరేకంగా ట్రూత్ సోషల్ వేదికగా ఇటీవల స్పందించిన ట్రంప్.. ఆయన్ని వేధించొద్దంటూ బ్రెజిల్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి:
భారీ షాకిచ్చిన ట్రంప్.. ఏకంగా 50 శాతం సుంకం
మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి