Share News

Thailand Cambodia Temple Dispute: థాయ్‌లాండ్‌, కాంబోడియా ఢీ

ABN , Publish Date - Jul 25 , 2025 | 03:03 AM

ఆగ్నేయాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పురాతన హిందూ ఆలయాలున్న ప్రాంతం కోసం థాయ్‌లాండ్‌, కాంబోడియా యుద్ధానికి దిగాయి..

Thailand Cambodia Temple Dispute: థాయ్‌లాండ్‌, కాంబోడియా ఢీ

శివాలయాలున్న ‘టా మ్యూయెన్‌’ ప్రాంతంపై ముదిరిన వివాదం

  • బీఎం-21 రాకెట్లు, శతఘ్నులతో కాంబోడియా దాడి

  • ఎఫ్‌-16 ఫైటర్లతో విరుచుకుపడిన థాయ్‌లాండ్‌

  • 11 మంది థాయ్‌ పౌరులు, ఒక సైనికుడి మృతి

  • పరస్పరం దౌత్యాధికారుల బహిష్కరణ

  • ‘ఖ్మేర్‌’ సామ్రాజ్య ప్రతీకలుగా ‘టా మ్యూయెన్‌’ ఆలయాలు

బ్యాంకాక్‌, జూలై 24: ఆగ్నేయాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పురాతన హిందూ ఆలయాలున్న ప్రాంతం కోసం థాయ్‌లాండ్‌, కాంబోడియా యుద్ధానికి దిగాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం, కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య ఉప్పూనిప్పుగా ఉన్న పరిస్థితిలో.. కాంబోడియాకు చెందిన డ్రోన్లు వివాదాస్పద ప్రాంతం మీద సంచరించడంతో అగ్గి రాజుకుంది. ఇరు దేశాల సైన్యాలు సరిహద్దుల వెంట పరస్పరం కాల్పులకు దిగాయి. తప్పు మీదంటే మీదంటూ ఇరు దేశాల నేతల ఆరోపణల పర్వం, రాయబారులు, దౌత్యాధికారుల బహిష్కరణ వంటి పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. కొన్ని గంటల్లోనే పరస్పరం దాడులకు దిగాయి. గురువారం థాయ్‌లాండ్‌పై బీఎం-21 రాకెట్లు, శతఘ్నులతో కాంబోడియా దాడులు చేసింది. థాయ్‌లాండ్‌ కూడా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఆరు ఎఫ్‌-16 యుద్ధ విమానాలతో కాంబోడియాలోని రెండు మిలటరీ స్థావరాలపై దాడి చేసినట్టు థాయ్‌ రక్షణ శాఖ ప్రతినిధి సురసంత్‌ కాంగ్‌సిరి ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఆరు చోట్ల కాల్పులు కొనసాగుతున్నట్టు చెప్పారు. కాంబోడియా ప్రయోగించిన శతఘ్ని గుళ్లతో సరిహద్దులో పౌర ఆవాసాలు ధ్వంసం అయ్యాయని, ఒక సైనికుడితోపాటు 11 మంది పౌరులు మరణించారని థాయ్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో ఏడుగురు సైనికులు, 24 మంది పౌరులు గాయపడ్డారని తెలిపింది. ఇక పురాతన ప్రీహ్‌ విహీర్‌ ఆలయం సమీపంలో రహదారిపై థాయ్‌లాండ్‌ యుద్ధ విమానాలు బాంబులు వేశాయని కాంబోడియా రక్షణ శాఖ ప్రకటించింది. ‘‘ఓడ్డార్‌ మీన్‌చే రాష్ట్రంలోని టా మ్యుయెన్‌ థోమ్‌, టా క్రాబే ఆలయాల ప్రాంతంలో ఉన్న కాంబోడియా ఆర్మీ స్థావరాలపై థాయ్‌లాండ్‌ దాడులు చేసింది. తర్వాత ప్రీహ్‌ విహీర్‌ ప్రాంతంలోనూ దాడులకు పాల్పడింది. మేం ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారాలనే కోరుకుంటాం. కానీ ఇప్పుడు థాయ్‌లాండ్‌కు దీటుగా జవాబు ఇవ్వడం తప్ప మాకు మరో మార్గం కనిపించడం లేదు’’ అని కాంబోడియా ప్రధాన మంత్రి హున్‌ మనెట్‌ పేర్కొన్నారు. అయితే కాంబోడియాలో మరణాల సంఖ్యపై ఎలాంటి ప్రకటన చేయలేదు.


దశాబ్దాలుగా సరిహద్దు వివాదం..

థాయ్‌లాండ్‌, కాంబోడియా దేశాలు అప్పట్లో ఫ్రెంచ్‌ వలస పాలనలో ఉండేవి. వాటికి స్వాతంత్య్రం ఇచ్చిన సమయంలో ఇరు దేశాల మధ్య సరిహద్దులను నిర్ధారించారు. అందులో ‘టా మ్యుయెన్‌’ ఆలయాల సమూహం, ప్రీహ్‌ విహీర్‌ ఆలయం ఉన్న కొంత ప్రాంతం విషయంలో మాత్రం ఇరుదేశాల మధ్య వివాదం నెలకొంది. ఖ్మేర్‌ సామ్రాజ్య సరిహద్దుల ప్రకారం ఈ ఆలయాల ప్రాంతం తమదేనని కాం బోడియా వాదిస్తుంటే.. కాదు తమ భూభాగమేనని థాయ్‌లాండ్‌ చెబుతోంది. ప్రస్తుతానికి ‘టా మ్యుయెన్‌’ ఆలయాలు థాయ్‌లాండ్‌ పరిధిలో ఉన్నా.. ప్రీహ్‌ విహీర్‌ ఆలయానికి సంబంధించి పలుమార్లు ఉద్రిక్తతలు తలెత్తాయి. 1962లో ప్రీహ్‌ విహీర్‌ ఆలయ ప్రాంతం కాంబోడియాదేనంటూ అంతర్జాతీయ కోర్టు (ఐసీజే) తీర్పు ఇచ్చింది. కానీ ఆ ప్రాం తం తమదేనని థాయ్‌లాండ్‌ పట్టుబట్టింది. ఈ ప్రాంతం కోసం 2008లో ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కాంబోడియా ప్రతిపాదన మేరకు ప్రీహ్‌ విహీర్‌ ప్రాంతాన్ని ‘ప్రపంచ వారసత్వ సంపద’గా యునెస్కో గుర్తించడంతో వివాదం మరింత ముదిరింది. 2011 ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది. ఐక్యరాజ్యసమితి జోక్యంతో సద్దుమణిగింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య పరిస్థితి ఉప్పూనిప్పుగానే ఉంది. ఇది ఎంతగా అంటే.. కాంబోడియా మాజీ ప్రధానితో అంకుల్‌ అంటూ మాట్లాడినందుకు థాయ్‌ ప్రధాని షినవత్రా ఇటీవల పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మే నెలలోనూ ఇరు దేశాల సైన్యాలు పరస్పరం కాల్పులకు పాల్పడ్డాయి. కాంబోడియాకు చెందిన ఒక సైనికుడు మృతిచెందారు. తాజాగా బుధవారం సరిహద్దుల్లో మందుపాతర పేలి ఐదుగురు థాయ్‌లాండ్‌ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి కొన్ని రోజుల ముందు కూడా మరోచోట మందుపాతర పేలి ముగ్గురు థాయ్‌ సైనికులు గాయపడ్డారు. ఈ క్రమంలో కాంబోడియా తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చి మరీ మందుపాతరలు పెడుతోందని థాయ్‌లాండ్‌ ఆరోపిస్తోంది. గురువారం ఉదయం నుంచి పరిస్థితి మరింత ముదిరి పరస్పర దాడుల వరకు వెళ్లింది. ‘టా మ్యుయెన్‌ థోమ్‌’ ఆలయ ప్రాంతంలో కాంబోడియా డ్రోన్‌ ఒకదాన్ని గుర్తించామని, ఆ తర్వాత ఆరుగురు కాంబోడియా సైనికులు తమ స్థావరం వైపు రావడం చూశామని థాయ్‌ ఆర్మీ తెలిపింది. థాయ్‌ సైనికులు గట్టిగా అరుస్తూ హెచ్చరిస్తుండగానే.. కాంబోడియా సైనికులు కాల్పులు జరపడం మొదలుపెట్టారని పేర్కొంది.


FGH.jpg

ప్రీహ్‌ విహీర్‌: 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్య ఒకటో యశోవర్మన్‌, ఒకటో సూర్యవర్మన్‌, రెండో సూర్యవర్మన్‌ రాజులు నిర్మించిన శివాలయం ఇది. డాంగ్రెక్‌ పర్వత శిఖరంపైన ఉన్న ఈ ఆలయంలో శివుడిని శిఖరేశ్వరుడిగా పిలుస్తారు. సంస్కృత, ఖ్మేర్‌ లిపిలో ఎన్నో శాసనాలు కూడా ఉన్నాయి.

Fsb.jpg

ప్రసాత్‌ టా మ్యుయెన్‌ టోట్‌: ఇది కూడా శివాలయమే. టా మ్యుయెన్‌ థోమ్‌కు ఈశాన్య దిశలో 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ ఆలయంలో శివలింగం లేదు. తర్వాతికాలంలో వైష్ణవాలయంగా, బౌద్ధ ఆరామంగా మార్చారు. ఏడో జయవర్మన్‌ కాలంలో ఆస్పత్రిగా, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వేదికగా వినియోగించినట్టు ఆధారాలు ఉన్నాయి.


ఖ్మేర్‌ సామ్రాజ్యం నాటి శివాలయాలు

11వ శతాబ్దంలో ఆగ్నేయాసియాను పాలించిన ఖ్మేర్‌ హిందూ సామ్రాజ్య ఘనకీర్తిని చాటేలా ఇప్పటికీ నిలిచి ఉన్న ఆలయాలు ఎన్నో. ప్రస్తుతమున్న కాంబోడియా, థాయిలాండ్‌, లావోస్ తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఖ్మేర్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. ఈ మూడు దేశాల మధ్య ఉన్న దట్టమైన అడవులు, డాంగ్రెస్‌ పర్వత ప్రాంతాన్ని ‘ఎమరాల్డ్‌ ట్రయాంగిల్‌’గా పిలుస్తారు. అక్కడ ‘టా మ్యూయెన్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌’గా పిలిచే మూడు హిందూ ఆలయాల సమూహం ఉంది. 11వ, 12వ శతాబ్దాల్లో నాటి ఖ్మేర్‌ రాజులువీటిని నిర్మించారు. ప్రస్తుత కాంబోడియాలోని ప్రఖ్యాత అంగ్‌కోర్‌వాట్‌ ఆలయం నుంచి థాయ్‌లాండ్‌లోని ఫిమై మధ్య ఖ్మేర్‌ సామ్రాజ్యం నాటి ప్రధాన రహదారిపై ఈ ఆలయాల సమూహం ఉంది. ఈ ఆలయాలపై సంస్కృతం, ఖ్మేర్‌ లిపిలో నాటి సంగతులెన్నో చెక్కి ఉన్నాయి. వాటిని ఇంకా పూర్తిగా గుర్తించలేదు.

GSN.jpg

‘ప్రసాత్‌ టా మ్యుయెన్‌ థోమ్‌’: 11వ శతాబ్దంలో రెండో ఉదయాదిత్యవర్మన్‌ నిర్మించిన శివాలయం. ప్రస్తుతం థాయ్‌, కాంబోడియా సరిహద్దుల్లో డాంగ్రెక్‌ పర్వతంపై ఉంటుంది. చతురస్రాకారపు పీఠంపై శివలింగం ఉంటుంది. పెద్ద గోపురంతో దక్షిణాభిముఖంగా ఆలయం నిర్మించారు.

ప్రసాత్‌ టా క్రాబే (క్రాబీ): టా మ్యుయెన్‌ థోమ్‌కు ఆగ్నేయ దిశలో 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న స్వయంభూ శివలింగమని చెబుతారు. ఆలయం, పరిసరాల్లో ఇతర దేవతామూర్తులు కూడా ఉన్నాయి. ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఇక్కడ ప్రత్యేక, తాంత్రిక పూజలు చేసేవారనే ఆధారాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‏లు

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

For More National News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 03:03 AM