Axiom-4: రేపే యాక్సియమ్-4 అంతరిక్ష యాత్ర.. ప్రకటించిన నాసా
ABN , Publish Date - Jun 24 , 2025 | 09:03 AM
రేపు యాక్సియమ్ -4 ప్రయోగం నిర్వహించనున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు నలుగురు వ్యోమగాములున్న డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌తో ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంది.

ఇంటర్నెట్ డెస్క్: సాంకేతిక కారణాలతో పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన యాక్సియమ్-4 మిషన్ ప్రయోగం రేపు నిర్వహించనున్నారు. జూన్ 25న ఈ అంతరిక్ష యాత్ర నిర్వహిస్తామని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తాజాగా పేర్కొంది. బుధవారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు ఫ్లోరిడా రాష్ట్రంలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. భారత వ్యోమగామి శుభాన్షూ శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో నింగిలోకి దూసుకుపోతుంది. జూన్ 26 భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుందని నాసా తెలిపింది.
తొలుత జూన్ 8న ఈ ప్రయోగం నిర్వహించాలని భావించారు. అయితే, డ్రాగన్ క్యాప్సుల్ ఎలక్ట్రికల్ హార్నెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మరుసటి రోజుకు వాయిదా వేశారు. ఆ తరువాత వాతావరణం సహకరించక ప్రయోగ తేదీని జూన్ 10కి మార్చాల్సి వచ్చింది. ఈసారి ఆక్సిజన్ సిలిండర్‌లో లీక్ కారణంగా మళ్లీ ప్రయోగం వాయిదా పడింది. దీంతో, జూన్ 12న ప్రయోగం నిర్వహించాలని భావించారు. ఈలోపు ఐఎస్ఎస్‌లో సాంకేతిక లోపాలు వెలుగులోకి రావడంతో ఈమారు జూన్ 22కు ప్రయోగం వాయిదా పడింది. ఈ క్రమంలోనే తాజాగా నాసా జూన్ 25న ప్రయోగం నిర్వహించనున్నట్టు పేర్కొంది.
యాక్సియమ్ స్పేస్ సంస్థ హ్యూమన్ ఫ్లైట్ విభాగం డైరెక్టర్, మాజీ నాసా ఆస్ట్రొనాట్ పెగ్గీ విట్సన్ ఈ మిషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇస్రో ఆస్ట్రొనాట్ శుభాన్షూ శుక్లా మిషన్ పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పోలాండ్ వ్యోమగామి సావోజ్ ఉజ్నాకీ, హంగరీకి చెందిన టిబోర్ కాపూ కూడా ఈ మిషయంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు.
ఇవీ చదవండి:
ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ముగిసింది.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్‌పై దాడి.. వీటి శక్తి ఎంతో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి