Iran's Offer Of Mediation: మధ్యవర్తిత్వానికి రెడీ.. ఇరాన్, సౌదీ అరేబియా ప్రకటన
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:14 PM
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమేనని ఇరాన్ తాజాగా ప్రకటించింది. రెండు దేశాలు తమకు సోదర సమానమైన దేశాలని ఇరాన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.

పహల్గాం దాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయి దాటకుండా ప్రపంచ దేశాలు తెరవెనుకు తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. భారత్, పాక్ మధ్య వారధిగా ఉండేందుకు, మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఇరు దేశాలతో తమకున్న సన్నిహిత సంబంధాలతో పరిస్థితి సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నిస్తామని తాజాగా ప్రకటించింది.
భారత్, పాక్‌తో తమది తరతరాల సన్నిహిత సంబంధమని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్‌చీ పేర్కొన్నారు. ప్రముఖ ఇరాన్ కవి షాదీ షిరాజీ 13వ శతాబ్దంలో రాసిన బనీ ఆడమ్ అనే కవితను కూడా ఆయన షేర్ చేశారు. మనుషులంతా ఒక్కటే ఒకరి బాధ మరొకరిని కదిలిస్తుందన్న పంక్తుల్ని ప్రస్తావించారు. ‘‘భారత్, పాక్ రెండూ మాకు సోదర సమానమైన దేశాలు. శతాబ్దాలుగా రెండు దేశాలతో మాకు సన్నిహిత సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. మిగతా పొరుగు దేశాల్లాగే, మేము భారత్, పాక్‌కు తొలి ప్రాధాన్యం ఇస్తాము. ఢిల్లీ, ఇస్లామాబాద్‌తో మాకున్న స్నేహ సంబంధాలతో ఈ కష్టకాలంలో ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఇరాన్ బాటలోనే సౌదీ కూడా మధ్యవర్తిత్వం నెరపేందుకు ముందుకొచ్చింది. సౌదీ యువరాజు ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ భారత్, పాక్ విదేశాంగ మంత్రులకు విడివిడిగా కాల్ చేసిన మాట్లాడినట్టు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన తెలిపింది. కాగా, సౌదీ విదేశాంగ మంత్రి, యువరాజు ఫైజల్ బిన్ ఫర్హాన్‌తో మాట్లాడినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా వెల్లడించారు. పహల్గామ్ దాడి వెనుకున్న సీమాంతర మూలాలు సౌదీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అణ్వాయుధ దేశాలపై భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీయొచ్చన్న భయాలు నెలకున్నాయి. మరోవైపు, ఎల్ఓసీ వెంబడి పాక్ తాజాగా కాల్పులకు తెగబడింది. భారత్ ఇందుకు దీటుగా జవాబిచ్చింది.
ఇవి కూడా చదవండి..
అదే జరిగితే సింధూ నదిలో వారి రక్తం పారుతుంది.. బిలావాల్ భుట్టో పిచ్చి కూతలు
అమెరికా కోసమే ఇదంతా.. ఉగ్రవాదంపై పాక్ రక్షణ శాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్య
పహల్గాం దాడిపై తొలిసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Read Latest and International News