Putin: కాల్పుల విరమణకు పుతిన్ అంగీకారం
ABN , Publish Date - Mar 14 , 2025 | 06:11 AM
అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి నియమనిబంధనలను రూపొందించాల్సి ఉందన్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం
ముఖ్య పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
మాస్కో, మార్చి13: అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి నియమనిబంధనలను రూపొందించాల్సి ఉందన్నారు. చిరశాంతికి అవే ప్రాతిపదికలు అవుతాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై అమెరికా సహచరులతోనూ, ఇతర భాగస్వాములతోనూ మాట్లాడనున్నట్లు ఆయన మాస్కోలో విలేకరుల సమావేశంలో తెలిపారు.
శాంతి ఒప్పందాన్ని ఎవరూ ఉల్లంఘించకుండా తగిన యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పుతిన్ చెప్పారు. అంతకు ముందు ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోకుంటే రష్యాకు తీవ్ర ఆర్థిక కష్టాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తాను తలచుకొంటే రష్యాకు కష్టాలు తీవ్రం చేయగలనని, అది రష్యాకు వినాశకరమవుతుందన్నారు. అయితే, తానలా కోరుకోవట్లేదని, శాంతిని కోరుకుంటున్నానని చెప్పారు.