Khawaja Asif Warns Afghans: అఫ్గానిస్థాన్‌కు పాక్ రక్షణ శాఖ మంత్రి వార్నింగ్.. మావైపు కన్నెత్తి చూస్తే..
ABN , Publish Date - Oct 29 , 2025 | 09:28 AM
అఫ్గానిస్థాన్‌ను అడ్డం పెట్టుకుని భారత్ తమపై దాడికి యత్నిస్తోందని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. భారత్ చేతిలో కీలుబొమ్మగా అఫ్గానిస్థాన్ మారిందని కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్-పాక్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ ముదురుతున్నాయి. టర్కీ వేదికగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్ (Pakistan) రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అఫ్గానిస్థాన్‌పై (Afghanistan) మండిపడ్డారు. భారత్ చేతిలో అప్ఘానిస్థాన్ కీలుబొమ్మగా మారిందని అన్నారు. తమపై దాడి జరిగితే తగిన రీతిలో బదులిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాబుల్ పాలకులు భారత్ చెప్పినట్టు ఆడుతున్నారని విమర్శించారు. ఇటీవల తమతో యుద్ధంలో ఓటమిని తట్టుకోలేని భారత్ అఫ్గానిస్థాన్‌ను రంగంలోకి దింపిందని ఆరోపించారు (Afghanistan India's Puppet Remark).
టర్కీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయని మంత్రి తెలిపారు. తమ మధ్య అవగాహన కుదురుతున్న తరుణంలో అఫ్గాన్ ప్రతినిధులు తమ ప్రభుత్వానికి సమాచారం అందించే వారని, ఆ తరువాత ఎవరో ఒకరు జోక్యం చేసుకోవడంతో వెనక్కు తగ్గేవారని అన్నారు. భారత్ ప్రభావానికి లోనైన కొందరు అఫ్ఘాన్ జనాలు చర్చలను ముందుకు సాగనీయట్లేదని ఆరోపించారు. పాక్‌తో పరోక్ష యుద్ధం కోసం ప్రయత్నిస్తున్న భారత్.. అఫ్గానిస్థాన్‌ను వాడుకుంటోందని ఆరోపించారు (Afghan Pak Tensions).
అఫ్గాన్, పాక్ మధ్య జరుగుతున్న చర్చలు సోమవారం ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. తెహ్రీకే తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) అనే ఉగ్రసంస్థ విషయంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. టీటీపీని అదుపులో పెట్టాలని అఫ్గానిస్థాన్‌ను పాక్ డిమాండ్ చేస్తుండగా తమకు వారితో ఎలాంటి సంబంధం లేదని అఫ్గానిస్థాన్ చెబుతోంది. వారు పాక్ పౌరులేనని వాదిస్తోంది. అయితే, టీటీపీ ఉగ్రవాదులు అఫ్గానిస్థాన్ వేదికగా తమ కార్యకలాపాలను స్వేచ్ఛగా సాగిస్తున్నారని పాక్ ఆరోపించింది. తమపై దాడికి ప్రయత్నిస్తే 50 రేట్ల అధిక తీవ్రతతో ప్రతిస్పందిస్తామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం కొనసాగుతోంది. రెండో దఫా చర్చలు మాత్రం ఎలాంటి ఆమోదయోగ్యమైన పరిష్కారం లేకుండానే ముగిశాయని ఇరు దేశాలు ప్రకటించుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
ట్రంప్‌లో తడబాటు.. అదే మతిమరుపు.. అచ్చు బైడెన్ లాగే..
మూడో పర్యాయం అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ట్రంప్ మక్కువ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి