Khawaja Asif: ఒకేసారి 2 యుద్ధాలతో ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటున్నారు.. భారత్‌పై పాక్ మంత్రి నిందలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:41 PM
అఫ్గానిస్థాన్ దూకుడుతో ఇక్కట్ల పాలవుతున్న పాక్ మళ్లీ భారత్‌పై నెపం నెట్టే ప్రయత్నం చేసింది. పాక్ తూర్పు, పశ్చిమ సరిహద్దుల వెంబడి భారత్ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని దాయాది దేశ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో విభేదాలతో సతమతమవుతున్న పాక్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కింది. రెండు వైపుల నుంచీ యుద్ధాలతో తమను భారత్ ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటోందని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు (Pak Min Khawaja Asif accuses India of Two Front War).
తమ దేశ తూర్పు, పశ్చిత సరిహద్దుల్లో యుద్ధాలను మొదలెట్టి తమకు తీరిక లేకుండా చేయాలని భారత్ భావిస్తోందని మంత్రి ఖవాజా ఆరోపించారు. భారత తరపున అప్ఘానిస్థాన్ యుద్ధం చేస్తోందని మండిపడ్డారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ పాక్ తూర్పు వైపున ఉన్న సరిహద్దు నుంచి ఆపరేషన్ సిందూర్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. మరోవైపు, పశ్చిమాన ఉన్న అఫ్ఘానిస్థాన్‌తో కూడా పాక్‌కు పొసగట్లేదు. ఇటీవల సరిహద్దు వెంబడి ఇరు దేశాల దళాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ప్రస్తుతం రెండు దేశాలు కాల్పుల విరమణ పాటిస్తున్నా పరిస్థితి మాత్రం నివురు గప్పిన నిప్పులాగానే ఉంది.
ఈ నేపథ్యంలో మంత్రి ఖవాజా ఆసిఫ్ అఫ్గానిస్థాన్‌పై కూడా మండిపడ్డారు. అష్రాఫ్ ఘానీ కాలం నుంచీ అఫ్గానిస్థాన్ భారత్ తరపున తమపై యుద్ధం చేస్తోందని అన్నారు. ఈ విషయంపై ప్రపంచమంతా స్పష్టత ఉందని అన్నారు. అవసరమైతే ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తామని అన్నారు. తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో ఘర్షణలతో తమను నిత్యం తికమకపెట్టాలనేదే భారత్ వ్యూహమని ఆరోపించారు.
అఫ్గానిస్థాన్‌తో ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై కూడా మంత్రి ఖవాజా స్పందించారు. ఖతర్, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాయని అన్నారు.
గతంలో కూడా పాక్ మంత్రి ఖవాజా భారత్‌పై ఇవే తరహా ఆరోపణలు చేశారు. భారత్ చెప్పినట్టల్లా అఫ్గాన్ నాయకత్వం ఆడుతోందని అన్నారు. ఈ తోలుబొమ్మలాటను భారత్ నియంత్రిస్తోందని చెప్పారు. అయితే, తూర్పు, పశ్చిమ తీరాల నుంచి భారత్ రెచ్చగొట్టే యుద్ధాలకు తాము సిద్ధంగానే ఉన్నామని కూడా చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
చైనాతో తొలగిన ప్రతిష్టంభన.. శ్వేత సౌధం కీలక ప్రకటన
మెక్సికో షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. 23 మంది మృతి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి